CM KCR : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పిట్ట కథ.. ఎవరి గురించో తెలుసా?
భారత్ త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందంటున్నారు కదా.. అది చాలా తక్కువ. ఎందుకంటే అభివృద్ధి సూచి తీసుకుంటే తలసరి ఆదాయంలో భారత్ 138వ స్థానంలో ఉంది. చిన్న దేశాలు అయిన బంగ్లాదేశ్...
CM KCR : పిట్ట కథలు తెలుసు కదా. తెలంగాణలో ఈ పిట్ట కథలు చాలా ఫేమస్. తెలంగాణ సీఎం కేసీఆర్ పిట్ట కథలు చెప్పడంలో దిట్ట. తాజాగా అసెంబ్లీలో ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ ఒక పిట్ట కథ చెప్పారు. ఆ పిట్టకథకు అసెంబ్లీలో నవ్వులు విరబూశాయి. దేశ ఆర్థిక దుస్థితిపై పార్లమెంట్ లో చర్చ జరగాలని సీఎ కేసీఆర్ అన్నారు. ప్రధాని మోదీ మాత్రం వాస్తవాలను పక్కన పెట్టి పొగడ్తలతోనే సరిపెడుతున్నారన్నారు. వాటిని విని ఆయన కూడా మురిసిపోతున్నారని.. అన్నీ తెలిసే సమయానికి ఆయన మాజీ ప్రధాని అవుతారని ప్రధాని మోదీని విమర్శిస్తూ ఈసందర్భంగా సీఎం కేసీఆర్ ఒక పిట్ట కథను చెప్పారు.
భారత్ త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందంటున్నారు కదా.. అది చాలా తక్కువ. ఎందుకంటే అభివృద్ధి సూచి తీసుకుంటే తలసరి ఆదాయంలో భారత్ 138వ స్థానంలో ఉంది. చిన్న దేశాలు అయిన బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక కంటే కూడా మన దేశంలో తలసరి ఆదాయం చాలా తక్కువ. అందుకే.. దేశ ఆర్థిక దుస్థితిపై పార్లమెంట్ లో చర్చ జరగాలి అని సీఎం కేసీఆర్ అన్నారు.
CM KCR : తిరుమల రాయుడు రాజు కథను చెప్పిన కేసీఆర్
తిరుమల రాయుడు అనే రాజు ఉన్నాడు. ఆయనకు ఒకటే కన్ను ఉంటుంది. తనకు ఒకటే కన్ను ఉందని చాలా బాధపడుతూ ఉండేవాడు ఆ రాజు. ఆ రాజ్యంలో ఉన్న ఒక కవి.. తనకు సమస్యలు ఉండటంతో రాజు గారిని పొగిడి రాజు దగ్గర బహుమానం పొందాలని అనుకుంటాడు. దీంతో అన్నాతిగూడి హరుడవు.. అన్నాతిని గూడనపుడు అసుర గురుండవు. అన్నా తిరుమలరాయ కన్నొక్కటే లేదు గానీ, కౌరవపతివే అంటూ తిరుమల రాయుడు మీద కవిత్వం చెబుతాడు ఆ కవి.
దాని అర్థం ఏంటంటే.. భార్యతో ఉన్నప్పుడు నువ్వు మూడు కళ్ల శివుడివి.. భార్యతో లేనప్పుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడంతటి వాడివి. ఒక్క కన్ను లేకపోతే నువ్వేమైనా తక్కువా.. కౌరవపతి.. అంటే ధృతరాష్ట్రుడంతటి వాడివి.. అంటూ ఆ కవి రాజును పొగుడుతాడు. ఇప్పుడు పార్లమెంట్ లో కూడా ప్రధానిని ఉద్దేశించి ఇలాగే పొగుడుతున్నారు. మంచి పనులు చేయకుండా బాగుంది.. బాగుంది అంటే ఎలా. ఒకసారి మాజీ ప్రధాని అయితే అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడూ పొగిడితే కూడా మంచిది కాదు.. అంటూ కేసీఆర్.. ప్రధాని మోదీ మీద వ్యంగ్యాస్త్రాలు సంధించారు.