హన్మకొండ-కరీంనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఇసుక లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో ఢీకొన్న ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.
Car accident with lorry family going to Vemulawada jatara Four people died hanamkonda
హన్మకొండ జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్కతుర్తి మండలం పెంచికలపేట సమీపంలోని శాంతినగర్ వద్ద ఎదురుగా వస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు ఏటూరునాగారం ప్రాంతానికి చెందిన మంతెన కాంతయ్య, శంకర్, భరత్, చందనగా గుర్తించారు. బాధితురాలి కుటుంబం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది. లోపల చిక్కుకున్న వారిని అతి కష్టం మీద బయటకు తీశారు. మృతదేహాలు ఛిద్రం కావడంతో ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది. తీవ్రంగా గాయపడి లోపల చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడానికి కట్టర్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ఇసుక లారీ అతివేగంతో వచ్చి ఢీకొట్టడంతో కారు మొత్తం ఇనుప రేకుల కుప్పలా మారింది.
అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు తరలించినట్లు తెలిపారు. దైవ దర్శనానికి వెళ్తుండగా మృత్యువు వారిని లారీ రూపంలో వెంబడించి నలుగురిని చంపేసింది. సోదరుల కుటుంబాలు వేములవాడకు దైవ దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇది కూడా చూడండి:Prague: యూనివర్సిటీలో కాల్పులు..14 మంది మృతి