»Bjps Bc Cm Is Going To Come In Telangana Modis Announcement In Bc Atmagourava Meeting
PM Modi: తెలంగాణలో బీజేపీ బీసీ సీఎం రాబోతున్నారు.. బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ ప్రకటన
హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంతో తనకు మంచి అనుబంధం ఉందని, ఇక్కడ సభను నిర్వహించే తాను ప్రధానిని అయ్యానని మోదీ అన్నారు. బీసీ ఆత్మగౌరవ సభలో ప్రజలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నట్లు తెలిపారు.
తెలంగాణలో బీజేపీ బీసీ సీఎం అధికారంలోకి రాబోతున్నారని, బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నేడు బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..9 ఏళ్లుగా తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేక ప్రభుత్వం ఉందని, కాంగ్రెస్ అనేది బీఆర్ఎస్ సీ టీమ్ అని, బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వ పట్టించుకోలేదని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏలో 3 ప్రధాన అంశాలు ఉన్నాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమించిందన్నారు.
బీసీ ఆత్మగౌరవ సభలో పాలుపంచుకోవడం తన అదృష్టమని ప్రధాని మోదీ అన్నారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేసింది బీజేపీయే అని, లోక్ సభ తొలి దళిత స్పీకర్‌గా బాలయోగిని నియమించింది కూడా బీజేపీయే అని మోదీ గుర్తు చేశారు. బీజేపీకి పూర్తి మద్దతు ఇచ్చి ఓబీసీగా ఉన్న తనను దేశానికి ప్రధానిని చేశారని, కేంద్ర కేబినెట్లో అత్యధికంగా బీసీ మంత్రులే ఉన్నారని అన్నారు. పార్లమెంట్ మొత్తంలో 85 మంది బీసీలు ఉన్నారన్నారు. తెలంగాణలో ఇప్పుడు బీసీ వ్యక్తి సీఎం కాబోతున్నారని, ఇది ఎంతో ఆనందించదగ్గ విషయమన్నారు.
గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసింది బీజేపీయే అని, ఈ ఎల్బీ స్టేడియంలో ప్రసంగించే తాను కూడా ప్రధానిని అయ్యాయనని అన్నారు. ఎల్బీ స్టేడియంలో తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలకు లిక్కల్ స్కామ్‌తో సంబంధాలున్నాయన్నారు. లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేస్తుంటే ఇక్కడి అధికారులు ఈడీ, సీఐడీ అధికారులను తిడుతున్నారన్నారు. తెలంగాణలో జరిగిన అన్ని పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్నారు. పేపర్లు లీక్ అవ్వడంతో చాలా మంది నిరుద్యోగులు ప్రాణాలు వదిలారన్నారు. పేద ప్రజలందరికీ ఉచిత రేషన్ అనేది మోదీ ఇస్తున్న గ్యారెంటీ అని అన్నారు.
అవినీతిని అంతం చేస్తాం అని, ఎవరైతే డబ్బును దోచుకున్నారో వారి నుంచి తిరిగి రాబడతామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. తెలంగాణలో వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవాలన్నదే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల లక్ష్యం అని అన్నారు. వచ్చే 5 ఏళ్ల వరకూ పేదలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. తెలంగాణలో నిజమైన అభివృద్ధి కనిపించడం లేదని, ఇప్పుడు తెలంగాణలో మార్పు తుఫాన్ కనిపిస్తోందన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరారు.