Wrestlers Protest నరేంద్ర మోదీ వల్ల కాదు: ప్రియాంకా గాంధీ
రెజ్లర్ల సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిష్కరిస్తారనే నమ్మకం లేదు. వీరి గురించి ఆందోళన చెంది ఉంటే ఇంతవరకు రెజ్లర్లతో ఎందుకు మాట్లాడలేదు? కనీసం వీరిని కలిసేందుకు కూడా ప్రయత్నించలేదు. రెజ్లర్లకు యావత్ దేశం అండగా నిలుస్తుంది
తమపై జరుగుతున్న వేధింపులు, అకృత్యాలపై ఆందోళన (Movement) చేస్తూ రోడ్డుపైకి చేరిన రెజ్లర్లకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. తమ ఉద్యమానికి రాజకీయ పార్టీలు (Political Parties) కూడా రావొచ్చని ప్రకటించడంతో వారి ఆందోళన మరింత ఉధృతంగా సాగుతోంది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు రెజ్లర్ల (Wrestlers Protest) ఆందోళనకు మద్దతు తెలుపుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) మద్దతు తెలిపారు. రెజ్లర్ల ఆందోళన కార్యక్రమంలో పాల్గొని మద్దతు ప్రకటించారు.
న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఆందోళన చేస్తున్న రెజ్లర్లను కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం ప్రియాంకా మాట్లాడుతూ.. ‘భారత రెజ్లింగ్ సమాఖ్య (Wrestling Federation of India -WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)పై కేసు నమోదు చేశారని చెబుతున్నారు. కానీ ఇంతవరకు ఆ కాపీలు బయటపెట్టలేదు. అందులో ఏముందో ఎశరికీ తెలియదు. ఎఫ్ఐఆర్ కాపీలను ఎందుకు బయటపెట్టడం లేదు?’ అని ప్రశ్నించారు. ‘రెజ్లర్లు పతకాలు (Medals) గెలిచినప్పుడు మనమంతా ట్విటర్ (Twitter)లో పోస్టు చేసి గర్వపడతాం. అదే క్రీడాకారులు ఇప్పుడు న్యాయం కోసం రోడ్డెక్కారు. ఇప్పుడు ట్వీట్లు చేయరా? మహిళా రెజ్లర్లంతా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇలా రోడ్లపైన ఆందోళన చేస్తున్నారు. వీరి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకుండా బ్రిజ్ భూషణ్ ను ఎందుకు కాపాడుతోంది?’ అని ప్రియాంకా గాంధీ నిలదీశారు.
‘బ్రిజ్ భూషణ్ ను పదవి నుంచి తొలగించాలి. రెజ్లర్ల సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పరిష్కరిస్తారనే నమ్మకం లేదు. వీరి గురించి ఆందోళన చెంది ఉంటే ఇంతవరకు రెజ్లర్లతో ఎందుకు మాట్లాడలేదు? కనీసం వీరిని కలిసేందుకు కూడా ప్రయత్నించలేదు. రెజ్లర్లకు యావత్ దేశం అండగా నిలుస్తుంది’ అని రెజ్లర్లకు ప్రియాంకా గాంధీ భరోసా ఇచ్చారు. కాగా, రెజ్లర్ల ఆందోళనకు రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి. ఆయా పార్టీల నాయకులు అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), కేటీఆర్ (KT Rama Rao), భూపీందర్ హుడా, దీపిందర్ హుడా, ఉదిత్ రాజ్ తదితరులు రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించారు.