బ్యాట్ తో సంచలన రేపుతున్న 21 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ (IPL)లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సరికొత్త రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్ (Season)లో అత్యధిక పరుగులు చేసిన అన్ క్యాప్డ్ ప్లేయర్ (UnCapped Player)గా జైస్వాల్ నిలిచాడు. పేద కుటుంబం నుంచి వచ్చి క్రికెట్ లో సత్తా చాటుతున్నాడు ముంబై కుర్రాడు.
రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టు తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లో బ్యాట్ తో రఫ్ఫాడిస్తున్నాడు. తాజా సీజన్ లో 14 మ్యాచ్ (Match)లు ఆడగా.. 48.07 సగటుతో మొత్తం 625 పరుగులు చేశాడు. ధర్మశాలలో శుక్రవారం పంజాబ్ కింగ్స్ (Punjab Kings)తో జరిగిన మ్యాచ్ లో 36 బంతుల్లో జైస్వాల్ అర్థ శతకం నమోదు చేశాడు. అతడి అత్యుత్తమ స్కోర్ (Score) 124. ఈ సీజన్ లో యశస్వి స్ట్రైక్ రేట్ 163.61తో పరుగులు సాధించాడు.
ఈ పరుగులతో 15 ఏళ్ల క్రితం నమోదైన రికార్డును (Record) యశస్వి తుడిచిపెట్టాడు. 2008లో ఐపీఎల్ లో ఆస్ట్రేలియా బ్యాటర్ షాన్ మార్ష్ (Shaun Marsh) అన్ క్యాప్డ్ బ్యాటర్ గా అత్యధిక పరుగులు చేశాడు. 11 మ్యాచుల్లో 616 పరుగులు చేశాడు. నిన్నటి మ్యాచ్ తో యశస్వి అతడి రికార్డును తిరగరాశాడు. ముంబైలో (Mumbai) పానీపూరి వేసుకుని జీవనం సాగించే కుటుంబం నుంచి వచ్చిన యశస్వి జైస్వాల్ క్రికెట్ (Cricket)లో సత్తా చాటుతున్నాడు. భవిష్యత్ లో భారత జట్టులో (Indian Team) అరంగేట్రం చేసే అవకాశం ఉంది.