T20 WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘కీలకమైన మ్యాచుల్లో రాణించడం ఆనందంగా ఉంది. వాంఖడే పిచ్‌పై 250+ పరుగుల లక్ష్యాన్నైనా ఛేదించేందుకు ఆస్కారముందని అనిపించింది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు జస్‌ప్రీత్ బుమ్రా అర్హుడని నా భావన. అతడు ప్రపంచ స్థాయి బౌలర్’ అని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 254 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 246/7 రన్స్‌కే పరిమితమైంది. బెతెల్ 105, బట్లర్ 25, విల్ జాక్స్ 35 రన్స్ చేశారు.
టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన కీలకమైన సెమీఫైనల్‌లోనూ ఘోరంగా విఫలమవడంతో, అతడిని జట్టు నుంచి తొలగించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యపు షాట్లతో వికెట్ పారేసుకోవడం వల్ల మిగిలిన బ్యాటర్లపై తీవ్ర ఒత్తిడి పడుతోందని అభిమానులు మండిపడుతున్నారు.
254 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ధాటిగా ఆడుతోంది. కేవలం 8.1 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. అయితే.. సాల్ట్ (5), బట్లర్ (25), బ్రూక్ (7), బంటన్ (17) వంటి కీలక బ్యాటర్లను కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో జాకబ్ బెథల్ (43), విల్ జాక్స్ (4) ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 71 బంతుల్లో 151 పరుగులు చేయాల్సి ఉంది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత్ ఏకంగా 19 సిక్సర్లు బాదింది. దీంతో ప్రస్తుత T20 WCలో టీమిండియా ఖాతాలో 84 సిక్సర్లు* చేరాయి. ఫలితంగా, ఒకే టీ20 ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో 76 సిక్సర్లతో వెస్టిండీస్ (2026) పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది.
టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్.. ఇంగ్లండ్ ముందు 254 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచుంది. అయితే, T20 WC నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది. 2016 సెమీఫైనల్‌లో భారత్‌పై వెస్టిండీస్ 193 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇప్పుడు ఇంగ్లండ్ ఈ రికార్డు లక్ష్యాన్ని ఛేదిస్తుందా..? లేదా..? కామెంట్ చేయండి.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ సెమీఫైనల్‌లో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. సంజూ శాంసన్ 89 పరుగులతో విధ్వంసం సృష్టించగా, దూబే (43), కిషన్ (39) మెరుపులు మెరిపించారు. చివర్లో పాండ్యా (27), తిలక్ (21) కూడా ధాటిగా ఆడటంతో భారత్ 20 ఓవర్లలో 253/7 పరుగులు చేసింది. సూర్య(11), అభిషేక్ (9) నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్స్, రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఇంగ్లండ్‌తో సెమీస్‌లో సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లోనే 89 పరుగులు చేశాడు. జాక్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించగా.. బౌండరీ దగ్గర సాల్ట్ క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. ఈ ఇన్నింగ్స్‌లో సంజూ 8 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియాలో తను ఎంతటి విలువైన ఆటగాడో సంజూ మరోసారి నిరూపించుకున్నాడు.
T20 WCలో గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు కెప్టెన్ రషీద్ ఖాన్‌పై వేటు వేసింది. రషీద్‌ను కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లుగా ప్రకటించింది. అతడి స్థానంలో ఓపెనింగ్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఇప్పటికే కోచ్ ట్రాట్ తప్పుకోవడంతో అతడిన స్థానంలో రిచర్డ్ పైబస్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్‌లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 20 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన భారత జట్టును సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 45 బంతుల్లోనే 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సంజూ 27 బంతుల్లో 55 పరుగులు చేయగా, ఇషాన్ 18 బంతుల్లో 39 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం శివం దూబే క్రీజులోకి వచ్చాడు.
టీ20 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ విధ్వంసం కొనసాగుతోంది. గత మ్యాచ్‌లో 97* పరుగులతో చెలరేగిన సంజూ.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీస్‌లో కేవలం 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు బాదాడు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం 8 ఓవర్లలో 92/1 పరుగులు చేసింది.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్‌లో అభిషేక్ శర్మ కేవలం 9 పరుగులకే ఔట్ అయ్యాడు. విల్ జాక్స్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అభిషేక్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అలాగే, ఆర్చర్ బౌలింగ్‌లో సంజూ శాంసన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ జారవిడిచాడు. ప్రస్తుతం సంజూ(31), కిషన్(15) క్రీజులో ఉన్నారు. భారత్ 5 ఓవర్లలో 55/1
భారత్‌తో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ క్రమంలో భారత కెప్టెన్ సూర్య మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాను ముందుగా బ్యాటింగే ఎంచుకునే వాడినని తెలిపాడు. ఎందుకంటే ఇలాంటి కీలక మ్యాచ్‌ల్లో ఛేజింగ్ చేయడం అంత తేలిక కాదన్నాడు. పెద్దగా మంచు ప్రభావం కూడా ఉండకపోవచ్చని చెప్పాడు. ఇది ఒక మంచి పిచ్ అని పేర్కొన్నాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ మరో ఘనత సాధించాడు. టీ20ల్లో భారత జట్టుకు అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన వారి జాబితాలో సూర్య(51 మ్యాచ్‌లు) మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా అతడు ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ(50) రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో ధోనీ(72), రోహిత్(62) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.