ఆసియా గేమ్స్ (Asian Games-2023)లో భారత్ పతకాలతో దూసుకుపోతోంది. అటు క్రికెట్ (Cricket)లో కూడా భారత్ ఫైనల్‌కు చేరింది. చైనా (China)లోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ గ్రౌండ్లో బంగ్లాదేశ్, భారత్ మ్యాచ్ జరిగింది. సెమీఫైనల్-1 మ్యాచ్‌లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఆసియా గేమ్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లి పతకాన్ని ఖాయం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ (Bangladesh) క్రీడాకారులను భారత బౌలర్లు బెంబేలెత్తించారు.
బంగ్లా టీమ్ క్రీడాకారుల్ని కట్టడి చేస్తూ భారత బౌలర్లు వరుస వికెట్లు తీశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 96 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా వికెట్ కీపర్ జకేర్ అలీ అత్యధికంగా 24 పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్ పర్వేజ్ హుసైన్ ఎమోన్ 23, రకీబుల్ హసన్ 14 రన్స్ చేసి జట్టు స్కోరును ముందుకు కదిలించారు. బంగ్లా జట్టులో మిగిలిన వారంతా రెండంకెల స్కోరును కూడా చేయకపోవడంతో స్వల్ప స్కోరునే బంగ్లాదేశ్ జట్టు చేయగలిగింది.
భారత బౌలర్లలో సాయి కిషోర్ 3 వికెట్లు పడగొట్టగా, వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశాడు. 97 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఓ వికెట్‌ను కోల్పోయి 4 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను సాధించింది. టీమిండియా (TeamIndia) కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 40, తిలక్ వర్మ 55 రన్స్ చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఈరోజు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. అందులో గెలిచిన వారు రేపు భారత్ జట్టుతో తలపడనున్నారు.