»Asian Games 2023 Ended Asian Games India Record With 107 Medals
Asian Games-2023: ముగిసిన ఏషియన్ గేమ్స్.. 107 పతకాలతో భారత్ రికార్డ్
ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు సాధించింది. భారత అథ్లెట్లు 107 పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ క్రీడాకారుల ఆటతీరుపై ప్రశంసలు కురిపించారు.
ఏషియన్స్ గేమ్స్ (Asian Games) ముగిశాయి. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో భారత్ రికార్డు నెలకొల్పింది. 28 స్వర్ణం, 38 రజత, 41 కాంస్య పతకాలతో భారత క్రీడాకారులు 107 పతకాలను (107 Medals) సాధించారు. 60 ఏళ్ల ఆసియా క్రీడల చరిత్రలోనే భారత్ ఈసారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. మొత్తంగా చూస్తే పతకాల పట్టికలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. భారత్ 4వ స్థానంలో ఉంది.
2018 ఆసియా గేమ్స్‌లో భారత్ 70 పతకాలను మాత్రమే సాధించింది. అయితే ఈసారి వాటికి అదనంగా మరో 37 పతకాలు సాధించడం విశేషం. గతంలో జకార్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు 16 బంగారు పతకాలు రాగా ఈసారి ఆ సంఖ్య 28 స్వర్ణ పతకాలకు చేరుకుంది.
శుక్రవారం వరకూ భారత్ ఖాతాల్లో 95 పతకాలు ఉంటే శనివారం ఒక్కరోజే భారత అథ్లెట్లు 12 పతకాలను సాధించడం విశేషం. అందులో 6 స్వర్ణం, 4 రజతం, 2 కాంస్య పతకాలు ఉన్నాయి. ఏషియన్ గేమ్స్ (Asian Games) చరిత్రలో మొదటిసారి బ్యాడ్మింటన్ లో భారత్ స్వర్ణ పతకాన్ని సాధించింది. తెలుగు ఆర్చర్ జ్యోతి సురేఖ సైతం స్వర్ణ పతకాన్ని సాధించింది.
What a historic achievement for India at the Asian Games!
The entire nation is overjoyed that our incredible athletes have brought home the highest ever total of 107 medals, the best ever performance in the last 60 years.
గత కొన్నేళ్ల నుంచి ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన చూపుతోంది. 2002లో 36 మెడల్స్ మాత్రమే సాధించింది. 2006లో 53 పతకాలు, 2010లో 65 పతకాలు, 2014లో 57 పతకాలు, 2018లో 70 పతకాలను భారత్ సాధించింది. ఇప్పుడు 2023లో 107 పతకాలతో నాలుగో స్థానంలో నిలిచింది. 2024లో పారిస్‌లో జరగబోయే ఒలింపిక్స్‌లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసేందుకు సిద్ధమవుతోంది.
రికార్డు స్థాయిలో భారత్ 107 పతకాలు సాధించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. పట్టుదల, దీక్ష, కఠిన శ్రమతో భారత క్రీడాకారులు దేశం గర్వించేలా చేశారన్నారు. వారి విజయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. అత్యున్నత లక్ష్యాలను చేరుకునేందుకు అందరికీ స్ఫూర్తినిస్తాయని ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. త్వరలోనే ఆయన పతకాలు సాధించిన క్రీడాకారులకు విందు ఇవ్వనున్నారు.