శ్రీలంకతో మూడో వన్డేలో భారత్ 317 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాట్స్‌మెన్, ఆ తర్వాత బౌలర్లు చెలరేగటంతో వన్డే చరిత్రలో భారీ విజయం సాధించిన జట్టుగా టీమిండియా నిలిచింది. విరాట్ కోహ్లీ 166 పరుగులతో, శుబ్‌మన్ గిల్ 116 పరుగులతో అదరగొట్టారు. మహమ్మద్ షమీ, సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. సిరాజ్ పవర్ ప్లే ఓవర్లలో వరుసగా వికెట్లను తీశాడు. శ్రీలంక టాప్ ఆర్డర్‌లోని ముగ్గురు ఆటగాళ్లను సిరాజ్ పెవిలియన్‌కు చేర్చాడు. అంతేకాదు, తన 10 ఓవర్ల కోటాలో 32 పరుగులు మాత్రమే ఇచ్చి, 4 వికెట్లు తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 390 పరుగులు చేస్తే, శ్రీలంక 73 పరుగులకే కుప్పకూలింది. ప్రపంచ కప్ ఏడాదికి ముందు ఈ ఫలితం ఆటగాళ్లలో విశ్వాసం నింపుతుంది.
మొదటి వన్డేలో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి, కొత్త బంతి తీసుకొని రెండు వికెట్లు తీశాడు. రెండో వన్డేలో ఒక వికెట్, మూడో వన్డేలో నాలుగు కీలక వికెట్లను పడగొట్టాడు. తన కెరీర్లో మదటిసారి ఐదు వికెట్ల స్పెల్ నమోదు చేసే అవకాశాన్ని కొద్దిలో చేజారాడు. సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి ఆరేళ్లు. థర్డ్ వన్డేలో సిరాజ్ అద్భుత ప్రతిభను రోహిత్ శర్మ రేర్ టాలెంట్ అంటూ ప్రశంసించాడు.
తన వన్డే కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల స్పెల్ పొందాలని ఎంతో ప్రయత్నం చేశానని, కెప్టెన్ రోహిత్ కూడా తన ఐదు వికెట్ల కోసం ప్రయత్నం చేశాడని, కానీ కుదరలేదన్నాడు సిరాజ్. కొన్నాళ్లుగా తనకు మంచి ఔట్ స్వింగ్ లభిస్తోందని, కానీ సీమ్‌లో వైవిధ్యం చూపించడం వల్ల వికెట్లు వస్తున్నాయన్నాడు. మొదట ఔట్ స్వింగ్ డెలివరీలతో బ్యాట్స్‌మెన్ మనస్సులో కొంత సందేహాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పాడు. తనకు ఐపీఎల్ సీజన్లో బ్యాడ్ టైమ్ నడిచిందని, దీంతో తాను వైట్ బాల్ క్రికెట్ పైన దృష్టి సారించి, విశ్వాసాన్ని పెంపొందించుకున్నట్లు చెప్పాడు సిరాజ్.