టీమిండియా క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా… ఇటీవల వరసగా గాయాలపాలైన సంగతి తెలిసిందే. వెన్ను నొప్పి కారణంగా బుమ్రాని టీ20 వరల్డ్ కప్ కి దూరంగా ఉంచుతున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా.. తాను టీ20 వరల్డ్ కప్ కి దూరం కావడం పట్ల బుమ్రా తాజాగా స్పందించాడు. తన బాధను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.
టీ20 వరల్డ్ కప్ కి దూరమైనందుకు తనకు చాలా బాధగా ఉందని చెప్పాడు. తాను గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. తాను గాయం నుంచి కోలుకున్నవెంటనే జట్టును ఉత్సాహపరుస్తానని ట్వీట్ ద్వారా తెలిపాడు.
ఇదిలా ఉండగా… టీమిండియా అక్టోబర్ 6వ తేదీన ఆస్ట్రేలియా బయలు దేరనుంది. ఈ సారి బీసీసీఐ ప్రత్యేక విమానాలు ఏవీ ఏర్పాటు చేయడం లేదు. కరోనా అదుపులోనే ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా సమయంలో భారత జట్టు ప్రత్యేక చార్టర్డ్ ఫ్లయిట్స్ ద్వారానే విదేశీ పర్యటనలకు వెళ్లి వచ్చింది.
ఆస్ట్రేలియా చేరుకుని అక్కడి పరిస్థితులకు అలవాటు పడనుంది. టోర్నీ ప్రారంభానికి కన్నాముందు భారత జట్టు రెండు వార్మప్ మ్యాచులు ఆడనుంది. అక్టోబర్ 23న భారత జట్టు తొలి మ్యాచ్ ఆడనుంది. భారత్ తన తొలి మ్యాచ్లోనే దాయాది జట్టు పాకిస్తాన్తో తలపడనుంది.
అక్టోబర్ 16న టీ 20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్లో శ్రీలంక జట్టు నమీబియాతో తలపడనుంది. నవంబర్ 13న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
నమీబియా, నెదర్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, జింబాబ్వే, యూఏఈ, ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, భారత జట్లు టీ 20 టోర్నీలో పాల్గొంటున్నాయి. అక్టోబర్ 12 నుంచి సూపర్ 12 మ్యాచులు ప్రారంభం కానున్నాయి.