Suryakumar: సూర్యకుమార్ యాదవ్ కి రూ.12లక్షల జరిమానా..!
రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై సొంతగడ్డపై జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించినందుకు సూర్యకుమార్‌కు ఐపీఎల్ జరిమానా విధించింది. ఈ సీజన్లో ముంబైకి ఇది మొదటి నేరం కాబట్టి, స్టాండ్-ఇన్ కెప్టెన్ సూర్యకుమార్‌కు కనీస ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి IPL ప్రవర్తనా నియమావళి ప్రకారం రూ.12 లక్షల ఫైన్ వేసింది.
ముంబయి ఇండియన్స్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్(suryakumar yadav)కి ఊహించని షాక్ తగిలింది. ఆదివారం సాయంత్రం వాంఖడే స్టేడియంలో… ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో అనారోగ్యం కారణంగా.. రోహిత్ శర్మ దూరం కాగా…కెప్టెన్సీ బాధ్యతలు సూర్యకుమార్ యాదవ్ కి అప్పగించాడు.
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ లో కెప్టెన్ గా తన తొలి మ్యాచ్ లో జట్టుకు ఘన విజయం అందించాడు. కానీ, తొలి పోరులోనే అతను జరిమానా ఎదుర్కొన్నాడు. అతనితో పాటు కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణాపై కూడా జరిమానా పడింది. స్లో-ఓవర్ రేట్ కారణంగా సూర్యకు మ్యాచ్ రిఫరీ రూ.12 లక్షలు జరిమానా వేశాడు. నిర్ణీత సమయంలో 20 ఓవర్లను పూర్తి చేయకపోవడంతో అతనిపై చర్యలు తీసుకున్నాడు.
మరోవైపు ముంబై బౌలర్ హృతిక్ షోకీన్ వేసిన తొమ్మిదో ఓవర్ తొలి బంతికి క్యాచ్ ఇచ్చి నితీష్ రాణా అవుటయ్యాడు. ఆ సమయంలో సంబరాలు చేసుకుంటున్న షోకీన్‌పై రాణా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. షోకీన్ కూడా బదులివ్వడంతో అతనిపైకి దూసుకెళ్లాడు.
సూర్యకుమార్, పీయూష్ చావ్లా వచ్చి ఈ ఇద్దరినీ విడ దీశారు. ఢిల్లీ రంజీ జట్టుకు ఆడుతున్న రాణా, షోకీన్ కు ముందు నుంచి పడదు. అయితే, రాణా, షోకీన్ క్రమశిక్షణ ఉల్లఘించినట్టు మ్యాచ్ రిఫరీ నిర్ధారించాడు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవల్ 1 నేరానికి పాల్పడినట్టు తేల్చి రాణా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించాడు. షోకీన్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పెట్టాడు.