»Ipl 2023 Mumbai Beat Punjab Kings Mumbai Won By 6 Wickets
IPL 2023 ఇషాన్, సూర్య విజృంభణ.. పంజాబ్ పై ముంబై విజయం
భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఒక దశలో ముంబై ఓటమి ఖాయమనే అందరూ అనుకున్నారు. కానీ ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ మ్యాచ్ ని మొత్తం తిప్పేశారు.
ఐపీఎల్ 2023లో (IPL) ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఖాతాలో మరో విజయం వచ్చిచేరింది. మొహాలీ వేదికగా బుధవారం ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తలపడిన విషయం తెలిసిందే. కాగా.. ఈ మ్యాచ్ లో ముంబైని విజయం వరించింది. ఇషాన్ కిషన్ (Ishan Kishan), సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) చెలరేగి ఆడటంతో.. పంజాబ్ కింగ్స్ జట్టు నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని ముంబై 18.5 ఓవర్లలోనే చేధించింది. ఇషాన్ కిషన్ 75 పరుగులు (41 బంతుల్లో, 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ 66 పరుగులు (31 బంతుల్లో, 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేశారు. ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.
పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ముంబైకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్లో మూడో బంతికే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) డకౌట్‌గా వెనుదిరిగాడు. రిషి ధావన్ (Rishi Dhavan) విసిరిన బంతిని సిక్సర్‌గా మలిచేందుకు ప్రయత్నించి షార్ట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఒక దశలో ముంబై ఓటమి ఖాయమనే అందరూ అనుకున్నారు. కానీ ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్ మ్యాచ్ ని మొత్తం తిప్పేశారు. వీరిద్దరూ చెలరేగి ఆడటంతో ముంబైకి విజయం సుగమమైంది. దీంతో నిర్ణీత ఓవర్ల కంటే ముందుగానే లక్ష్యాన్ని చేధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. 7 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన ప్రభుసిమ్రాన్ సింగ్ (Prabhu Simran Singh), అర్షద్ ఖాన్ (Arshad Khan)బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. పంజాబ్ 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో శిఖర్ ధావన్ (Shikar Dhavan), మాథ్యూ షార్ట్ కలిసి రెండో వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 20 బంతుల్లో 5 ఫోర్లతో 30 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్, పీయూష్ చావ్లా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 27 పరుగులు చేసిన మాథ్యూ షార్ట్, పీయూష్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
32 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న లియామ్ లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. 4 ఓవర్లలో 56 పరుగులు ఇచ్చిన జోఫ్రా ఆర్చర్, ఐపీఎల్ కెరీర్లో చెత్త బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. జితేశ్ శర్మ (Jitesh Sharma) 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేయగా, లియామ్ లివింగ్‌స్టోన్ 42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ కలిసి 53 బంతుల్లో 119 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారీ స్కోర్ చేసినా పంజాబ్ కి విజయం వరించలేదు.