GT vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ కి (SRH) ఓటమి కొత్తేమీ కాదు. ఈ ఐపీఎల్ 2023 సీజన్ మొదలైన దగ్గర నుంచి గొప్పగా చెప్పుకునేలా ఆడిన మ్యాచ్ ఒక్కటి కూడా లేదు. అసలు ఏ మ్యాచ్ గెలవలేదా అంటే గెలిచింది. చాలా తక్కువ. గెలిచిన మ్యాచుల కంటే ఓడిన మ్యాచులే ఎక్కువ. అందుకే కనీసం ప్లే ఆఫ్ రేసులో కూడా లేకుండా పోయింది.
సోమవారం సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడ్డాయి. ఈ మ్యాచ్ తో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. గుజరాత్ టైటాన్స్ పై 34 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ చిత్తుగా ఓడింది. ఇక ప్లేఆఫ్ కి చేరిన మొదటి టీమ్ జాబితాలో గుజరాత్ చేరడం విశేషం. ఈ విజయంతో గుజరాత్ (Gujarat) ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఈ సీజన్లో నాకౌట్ బెర్త్‌ను అందుకున్న తొలి టీమ్‌గా కూడా గుజరాత్ నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. క్లిష్టమైన లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు అన్మోల్ ప్రీత్ సింగ్ (5), అభిషేక్ శర్మ (4) శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. కెప్టెన్ మార్క్రమ్ (10), రాహుల్ త్రిపాఠి (1), సన్వీర్ సింగ్ (7), అబ్దుల్ సమద్ (4) విఫలమయ్యారు. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ (64) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతనికి భువనేశ్వర్ కుమార్ (27) అండగా నిలిచాడు. మిగతా వారిలో మర్కండే 18 (నాటౌట్) ఒక్కడే కాస్త రాణించాడు.
ఇక సన్ రైజర్స్ ఓటమిపై నెట్టింట మీమ్స్ వస్తున్నాయి. ఎలా ఓడిపోవాలో మాకు బాగా తెలుసు అని సన్ రైజర్స్ ని ఉద్దేశించి కొందరు నెటిజన్లు కామెంట్ చేయడం విశేషం. మమ్మల్ని ఎవరూ ఓడించాల్సిన అవసరం లేదు. మాకు మేమే ఓడిపోతాం అంటూ ఆ టీమ్ పై కౌంటర్లు వేయడం గమనార్హం.