క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచ కప్ 2023 ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ మధ్య జరగనుంది. టోర్నీకి చాలా రోజుల నుంచి సన్నాహాలు చేస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా టోర్నీ కొత్త షెడ్యూల్‌ను విడుదల చేస్తూ ప్రకటన చేసింది. భారత్-పాకిస్థాన్ సహా 9 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మార్చాలని ఈ మేరకు బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా ప్రత్యేక రోజున ఓ మ్యాచ్ ఆడే పరిస్థితి ఉంది. గత 31 ఏళ్లుగా ఈ ప్రత్యేకమైన రోజున టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదని చెప్పాలి. అయితే ఇప్పుడు అది కార్యరూపం దాల్చనుంది.
ముందుగా అక్టోబర్ 15వ తేదిన ఆదివారం అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఉంది. అయితే ఇప్పుడు ఆ మ్యాచ్‌ను అక్టోబర్ 14వ తేదికి మార్చారు. నెదర్లాండ్స్‌తో భారత్ తన చివరి లీగ్ గేమ్ బెంగళూరులో నవంబర్ 11న ఉండగా దానిని డే అండ్ నైట్ నవంబర్ 12కు మార్చారు. ఆ రోజు దీపావళి పండుగ కాబట్టి టీమిండియా ఇప్పటి వరకూ క్రికెట్ ఆడలేదు. అయితే ఈసారి ఆ ప్రత్యేక రోజున కూడా టీమిండియా మ్యాచ్ ఆడనుంది.
చరిత్రలో ఇప్పటి వరకూ దీపావళి ప్రత్యేక పండుగ రోజున టీమిండియా రెండుసార్లు మాత్రమే మ్యాచ్ ఆడింది. 1987 ప్రపంచ కప్ సందర్భంగా మొదటిసారి ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత 1992లో దీపావళి పండుగ రోజున టీమిండియా చివరిసారిగా జింబాబ్వేతో మ్యాచ్ ఆడగా రెండు మ్యాచుల్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఇప్పుడు మూడోసారి మ్యాచ్ ఆడనుంది.