క్రికెటర్ శిఖర్ ధావన్‌కు ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు బుధవారం విడాకులు మంజూరు చేసింది. అతని భార్య మానసికంగా అతన్ని ఇబ్బంది పెట్టిందనే కారణాలను కోర్టు అంగీకరించింది.
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan)కి విడాకులు మంజూరయ్యాయి. ఢిల్లీలోని ఫ్యామిలీ కోర్టు భారత క్రికెటర్ శిఖర్ ధావన్-అతడి మాజీ భార్య అయేషా ముఖర్జీ(ayesha mukherjee)కి విడాకులు మంజూరు చేసింది. విచారణ సందర్భంగా ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి హరీశ్ కుమార్..ధావన్ చేసిన ఆరోపణలు అన్నీ నిజమైనవని విశ్వసించారు. ఆయేషా ముఖర్జీ తనను మానసికంగా వేధించిందన్న శిఖర్ ధావన్ వ్యాఖ్యను కోర్టు సమర్థించింది. ఒక్కగానొక్క కుమారుడితో కొన్నాళ్ల పాటు విడిగా ఉండాలని భార్య ఆయేషా ఒత్తిడి చేయడంతో ధావన్ మానసిక వేదనకు గురయ్యారని కోర్టు అభిప్రాయపడింది.
‘వివాహానికి ముందు ధావన్‌తో కలిసి ఇండియాలో నివసించేందుకు ఆయేషా అంగీకరించింది. కానీ ఆమెకు అప్పటికే మొదటి వివాహం ద్వారా జన్మించిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దీంతో ధావన్‌కు ముందుగా ఇచ్చిన మాట ప్రకారం ఇండియా(india)లో ఎక్కువ కాలం నివసించలేదు. కుమారుడు జోరావర్‌ను కూడా ఆస్ట్రేలియాలోనే పెంచింది. ఇందులో ధావన్ తప్పు లేకున్నా అతనికి కుమారుడిని దూరం చేసిన ఆయేషా మానసిక ఆవేదనకు గురి చేసింది. అలాగే ధావన్ తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన మూడు ఆస్తులలో ఒకదానిని 99 శాతం తన పేరిట రాయాలాని ఆయేషా ఒత్తిడి చేసింది. మిగిలిన రెండు ఆస్తుల్లో తనను ఉమ్మడి యజమానిగా ఉంచాలని ధావన్‌ను వేధించింది. ధావన్ పరువుకు నష్టం కలిగించేలా అతని తోటి క్రికెటర్లు, ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఆయేషా సందేశాలు పంపించిందని కోర్టు పేర్కొంది.
అలాగే ఆయేషా కుమారుడితో ఇండియాలో ఉన్న సమయంలో కూడా ఆస్ట్రేలియాలో ఉన్న కుమార్తెల పాఠశాల ఫీజుల కోసం ధావన్ నుంచి డబ్బులు వసూల్ చేసినట్లు అతని తరఫు న్యాయవాది అమన్ హోంగోరాణి కోర్టుకు తెలిపారు. నెలకు రూ.80 లక్షల నుంచి రూ. కోటి వరకు పంపాలని ఒత్తిడి చేసినట్లు వివరించారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు విడాకులు(Divorce )మంజూరు చేసింది.