తెలంగాణలో సై అంటే సై అంటున్న బీజేపీ, బీఆర్ఎస్ ఓ విషయంలో మాత్రం ఒకే ఆలోచనతో ఉన్నాయట. కలిసి పని చేయనప్పటికీ… అమిత్ షా, కేసీఆర్‌ల ఆరాటం జగన్ గెలుపు, చంద్రబాబు ఓటమి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 2015లో ఓటుకు నోటు కేసు నుండి చంద్రబాబును టార్గెట్ చేస్తూ వస్తున్నారు కేసీఆర్. అలాగే, 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు తన రాజకీయ మనుగడ కోసం ఏపీలో తమను బద్నాం చేసేందుకు అస్త్రశస్త్రాలు ఉపయోగించిన టీడీపీ అధినేతను ఎట్టి పరిస్థితుల్లోను నమ్మేలా లేదు బీజేపీ. ఏపీలో ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. మరోసారి జగన్ అధికారంలోకి వచ్చేలా ఈ రెండు పార్టీల తీరు కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి కేసీఆర్, మోడీలకు చంద్రబాబుతో దూరం ఇంకా తగ్గలేదనే అంటున్నారు. అందుకే ఏపీలో వారి ప్రయత్నాలు కావొచ్చు నిర్ణయాలు కావొచ్చు… అన్నీ టీడీపీని దెబ్బతీసేలా, వైసీపీకి అనుకూలంగా ఉంటున్నాయని చెబుతున్నారు.
ఆ మూడు పార్టీలు ఒక్కటైతే
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒక్కటైతే జగన్‌ను ఓడిస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే, బలమైన కూటమి అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ఎంతో ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు. జనసేనానితో కలిసేందుకు ఏమాత్రం అభ్యంతరం లేని కమలం పార్టీ, టీడీపీతో మాత్రం ససేమీరా అంటోంది. టీడీపీని పక్కన పెడితే, తమ కూటమి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణే అని బాహాటంగా ప్రకటన చేస్తోంది. గత అనుభవం దృష్ట్యా చంద్రబాబుతో ముందుకు సాగేందుకు బీజేపీకి ఏమాత్రం ఇష్టపడటం లేదని అర్థమవుతోంది. ఓటు బ్యాంకు తక్కువగా ఉన్నప్పటికీ… టీడీపీ, జనసేన కూటమిలో చేరకుంటే ఇది జగన్‌కు ప్లస్ అవుతుంది. అంతేకాదు, ఢిల్లీ పెద్దలు కలిస్తే, ఎన్నికల సమయంలో జగన్‌తో పాటు ప్రతిపక్ష కూటమికి కూడా అధికార బలం తోడవుతుంది. ఇలాంటి లెక్కలు పవన్ వేసుకొని, కలిసి ముందుకు నడుద్దామని సూచిస్తున్నారు.
‘కాపు’ కాస్తున్న కేసీఆర్
మరోవైపు, బీఆర్ఎస్ పార్టీ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన కేసీఆర్, వివిధ రాష్ట్రాల్లో పార్టీలోకి, పార్టీ అనుబంధ సంఘాల్లోకి చేరికలను ప్రారంభించారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షులుగా తోట చంద్రశేఖర రావుకు బాధ్యతలు అప్పగించారు. ఆయన ద్వారా ఏపీలో మెజార్టీగా ఉన్న కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సఫలమవుతుందనే విషయాన్ని పక్కన పెడితే, కేసీఆర్ ప్రయత్నాలు టీడీపీ-జనసేన కూటమి ఓటు బ్యాంకుకు ఎసరు పెడుతుందని చెప్పవచ్చు. ఏపీలో మెజార్టీగా ఉన్న తమకు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంపై కాపులు కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో మెజార్టీ సామాజిక వర్గం జనసేనానికి అండగా ఉంటారని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు కేసీఆర్ కీలక కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కనీసం సానుభూతి ఓట్లు అయినా ఉంటాయి. ఇది టీడీపీ-జనసేనకు మైనస్ అయి, వైసీపీకి ప్లస్ అవుతుందని గుర్తు చేస్తున్నారు. మొత్తానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఏపీలో వేసే అడుగులు జగన్‌కు ప్లస్, బాబు-పవన్ కూటమికి మైనస్ అవుతుందని చెబుతున్నారు.