ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు చేశారు. రూ.4 వేల కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని తెలంగాణ సర్కార్ కట్టబెట్టిందన్నారు. అందుకు బదులుగా తోట చంద్రశేఖర్ ఖమ్మం సభకు ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. రఘునందన్ రావు చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. హఫీజ్ పేట సర్వే నంబర్ 78లో ఓ జెవెల్లరీ సంస్థ వ్యాపారికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇదే సర్వే నంబర్లో తోట చంద్రశేఖర్‌కు వ్యతిరేకంగా ఎందుకు ఫైల్ చేయలేదని అడిగారు. 40 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు రంగం సిద్దం చేశారని ఆరోపించారు.
ఒకే సర్వే నంబర్ 78లో 8 ఎకరాలపై ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ ఫైల్ చేసిందని.. అదే సర్వే నంబర్లో 40 ఎకరాల భూమిపై ఎందుకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం లేదని నిలదీశారు. తోట చంద్రశేఖర్‌ను బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించింది ఇందుకేనా అని అడిగారు. కేసీఆర్‌కు ఇప్పుడు ఏపీకి చెందిన నేతలు మంచి మిత్రులు అయ్యారా అని ప్రశ్నించారు. ఆంధ్రావారు దొంగలు అని ఒకప్పుడు దూషించి, ఇప్పుడు ఆ ప్రాంతానికి చెందినవారికే ఎందుకు భూములు కట్టబెట్టడంలో ఆయన స్వార్థం ఉందన్నారు. మియాపూర్ భూముల వ్యవహారంలో జరిగిన గోల్ మాల్‌పై ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
ఎస్ఎల్పీ వేయని రంగారెడ్డి కలెక్టర్‌ను ఎందుకు విచారించకూడదని నిలదీశారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుంభకోణాలు జరిగి ఉంటాయని సందేహాం వ్యక్తం చేశారు. హైదరాబాద్ శివారులో ప్రభుత్వ భూములను తమకు నచ్చిన, సంస్థలకు కేసీఆర్ సర్కార్ కట్టబెట్టిందని రఘునందన్ రావు ఆరోపించారు. బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారులకు కీలక పోస్టింగులు ఇవ్వడంలో మర్మం ఏమిటని అడిగారు. కేసీఆర్‌కు బీహర్ మూలాలు ఉన్నాయని గతంలో వచ్చిన ఆరోపణలను గుర్తుచేశారు. అందుకే పార్టీకి కూడా బీఆర్ఎస్ అని పెట్టారని ఆరోపించారు. సోమేశ్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో ప్రభుత్వం చేసిన నిర్ణయాలపై సమీక్ష చేయాలని హైకోర్టును కోరానని రఘునందన్ రావు తెలిపారు. గత మూడేళ్లలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాటిని సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.