కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కాంగ్రెస్ నేత మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయనను నిందితుడిగా చేర్చారు. అంతకుముందు వార్ రూమ్ తన పర్యవేక్షణలోనే కొనసాగేదని.. తనకు నోటీసులు ఇవ్వకుండా సునీల్ కనుగోలును విచారించడం ఏంటీ అని మాట్లాడారు. సునీల్ విచారణ, అందులో ఆయన చెప్పిన అంశాల ఆధారంగా మల్లు రవిని నిందితుడిగా చేర్చారు. ఆ వెంటనే మల్లు రవి మాట మార్చేశారు. తనకేం తెలియదని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్ వార్ రూమ్‌తో తనకు సంబంధం లేదని సునీల్ కనుగోలు సీసీఎస్ పోలీసుల విచారణలో చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీకి వ్యుహాలు మాత్రమే చెబుతానని వివరించారు. వార్ రూమ్ ఇంచార్జీ మల్లు రవి అని, ఆయన చెప్పింది తమ టీమ్ చేస్తోందని పోలీసులు విచారణలో తెలిపారు. దీంతో పోలీసులు మల్లు రవిని నిందితుడిగా చేర్చారు. నిన్న మంగళవారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు మల్లు రవి వెళ్లగా.. తనకు ఇచ్చిన 41 సీఆర్పీసీ కింద ఇచ్చిన నోటీసులపై అడిగారు. రేపు (గురువారం) స్టేషన్ రావాలని సమాధానం ఇచ్చారు. కానీ ఇంతలోనే మల్లు రవి పేరును నిందితుడిగా చేర్చారు.
టీ కాంగ్రెస్ వార్ రూమ్ పేరుతో సోషల్ మీడియా నిర్వహిస్తోంది. ఆఫీసు మాదాపూర్‌లో ఉంది. తెలంగాణ గళం పేరుతో ఫేస్ బుక్‌లో పేజీ క్రియేట్ చేశారు. సునీల్ కనుగోలు నేతృత్వంలో వార్ రూమ్ కొనాసాగుతోంది. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సహా పలువురిని కించపరిచేలా పోస్టింగ్స్ పెట్టారు. మంత్రి కేటీఆర్, కవితకు వ్యతిరేకంగా కామెంట్స్ ఉన్నాయి. గత ఏడాది నవంబర్ 24వ తేదీన మాదాపూర్‌లో గల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వార్ రూమ్‌పై పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న ఇషాన్ శర్మ, తాతినేని శశాంక్, శ్రీప్రతాప్ను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారికి నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సునీల్ కనుగోలు అని పోలీసులు ఆ సమయంలోనే చెప్పారు.
ఈ ఏడాది డిసంబర్‌లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన పోటీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జనాల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతోంది. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారానే వేగంగా చేరుకోవచ్చని, వార్ రూమ్ పేరుతో ఆఫీసు కూడా తెరిచింది. అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తామో మాత్రం చెప్పకుండా, వ్యక్తిగతంగా పోస్టింగులు, వీడియోలు మార్పింగ్ చేశారు. వాటిని సీసీఎస్ పోలీసులు గుర్తించడంతో విషయం వెలుగుచూసింది. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. తొలుత సునీల్‌ను విచారించారు. ఆయన చెప్పిన అంశాల ఆధారంగా ఇప్పుడు మల్లు రవిని నిందితుడిగా చేర్చారు.