Karnataka Elections 2023: కర్ణాటకలో ఓ పక్క కాంగ్రెస్‌కి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చేలా ట్రెండ్స్ కనిపిస్తున్న నేపథ్యంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండూ పార్టీలు పొలిటికల్ గేమ్‌కు తెరతీసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే బీజేపీ ప్రత్యేకంగా జేడీఎస్ నేత కుమారస్వామితో సీక్రెట్ మీటింగ్ నిర్వహించినట్లు వార్తలు రాగా.. ఇప్పుడు కాంగ్రెస్ తన ఎమ్మెల్యేలను తమిళనాడు తరలిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
మధ్యాహ్నం 12 గంటల సమయం వరకు 118 సీట్లలో ఆధిక్యంలో కాంగ్రెస్ ఉండడంతో మ్యాజిక్ ఫిగర్ దాటడం పక్కా అని ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా గెలిచిన నేతలంతా సాయంత్రానికి బెంగళూరులోని షాంగ్రి లా హోటల్‌కి చేరుకోబోతున్నారు.
అయితే అంతర్గత సమాచారం ప్రకారం.. కాంగ్రెస్‌కి ఒకవేళ 130 కంటే తక్కువ సీట్లు వచ్చినట్లయితే ముందు జాగ్రత్తగా ఆ ఎమ్మెల్యేలందరినీ తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న ఓ హోటల్ కు తరలిస్తారని తెలుస్తోంది. పార్టీ నేతలను బీజేపీ కొనుగోలు చేయకుండా, కాంగ్రెస్ బలం తగ్గకుండా ఉండేందుకే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.