బైక్ పై రాంగ్రూట్లో వచ్చిన యువకుడిని లాఠీతో కొట్టిన ఎస్సైపై మాజీ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైతో యువకుడికి క్షమాపణలు చెప్పించడమే కాకుండా కేసు నమోదు చేయించారు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లిలో జరిగిందీ ఘటన. కూనారపు భిక్షపతి అనే యువకుడు రాంగ్రూట్లో ద్విచక్ర పై వస్తుండడాన్ని గమనించిన స్థానిక ఎస్సై రామకృష్ణ అతడిని ఆపి లాఠీతో కొట్టారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న మాజీ కలెక్టర్ ఆకునూరి మురళి తన వాహనాన్ని ఆపి ఎస్సై వద్దకు వెళ్లి ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. అసలు కొట్టే హక్కు మీకెక్కడిదని నిలదీశారు. ఆయనతో యువకుడికి క్షమాపణ చెప్పించారు. భిక్షపతికి క్షమాపణ చెప్పి ఎస్సై అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, మురళీ మాత్రం ఆ విషయాన్ని అక్కడితో విడిచిపెట్టలేదు. భిక్షపతితో కలిసి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆయనపై ఫిర్యాదు చేయించారు.