ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక అధికారిని శ్రీలక్ష్మీపై (IAS Officer Srilaxmi) అమరావతి రైతులు (Amaravati Farmers) తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.మే నెలలో చెల్లించాల్సిన కౌలును దసరా వచ్చినా చెల్లించడంలేదని రాజధాని రైతులు మండిపడ్డారు. 2014లో రాజధాని లేని రాష్ట్రానికి ఇక్కడ 29 గ్రామాల్లో 34 వేల ఎకరాలను సేకరించారని.. రైతులతో సీఆర్డీఏ వారు ఒప్పందం చేసుకున్నారని అమరావతి రైతులు(Farmers of Amaravati) తెలిపారు. ఒప్పందం ప్రకారం తమకు 10 సంవత్సరాలు వార్షిక కౌలు ప్రతి సంవత్సరం మేలో చెల్లించాలని.. ఇప్పటికే ఎనిమిది సంవత్సరాలు పట్టాలు ఉన్నవారికి చెల్లించారని తెలిపారు.
తొమ్మిదవ సంవత్సరం సీఎం జగన్ (CM Jagan) ప్రభుత్వం ఐదు నెలల దాటినప్పటికీ ఇప్పటికీ చెల్లించకపోవడంతో కోర్టులో పిటిషన్ వేసినట్లు రైతులు తెలిపారు. వార్షిక కౌలు చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. సంబంధిత అధికారిని ఐఏఎస్ శ్రీలక్ష్మీ చర్యలు చేపట్టకపోవడంతో కోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని అన్నారు. అధికారులు బాధ్యతలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల తాము నష్టపోతున్నామన్నారు. దీంతో సంబంధిత అధికారిని శ్రీలక్ష్మి పై చర్యలు తీసుకోవాలని తుళ్లూరు పోలీస్ స్టేషన్(Police station)లో అమరావతి రైతులు ఫిర్యాదు చేశారు. మొత్తం 22,948 రైతులకు సుమారు రూ.183.17 కోట్లు కౌలు చెల్లించాల్సి ఉందని ఫిర్యాదులో రాజధాని రైతులు వివరించారు. నిధుల విడుదలకు జీవో జారీ అయినప్పటికీ రైతుల అకౌంట్లలో డబ్బులు వేయలేదని ఆరోపించారు. సీఆర్పీసీ 166 ప్రకారం ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.