»Chandrababu Who Was Arrested In The Skill Case Spoke In A Video Conference From The Jail After The Judicial Remand Expired He Told The Magistrate That He Was Concerned About His Safety
Chandrababu : నా భద్రత విషయంలో ఆందోళన ఉంది
స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ గడువు పూర్తికావడంతో కారాగారం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తన భద్రత విషయంలో ఆందోళన ఉందని న్యాయాధికారితో చెప్పారు.
Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబుకు న్యాయస్థానం విధించిన జ్యుడిషియల్ రిమాండు గడువు పూర్తికావడంతో కారాగారం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏసీబీ కోర్టు న్యాయాధికారితో మాట్లాడించారు. ఈ క్రమంలో న్యాయాధికారి చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నించగా.. తనకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. వైద్య నివేదికలను తనకు ఇస్తున్నారని చెప్పారు. తన భద్రతపై అనుమానాలున్నాయని విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఎదుట చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నేను జడ్ ప్లస్ భద్రత కలిగిన వ్యక్తిని. జైలు లోపల, బయట నాకు భద్రత విషయంలో సందేహాలున్నాయని తెలిపారు.
ప్రస్తుతం ఆయన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో తీర్పు పెండింగ్‌లో ఉండటం, హైకోర్టులో బెయిల్ పిటిషన్ పెండింగ్ ఉండటం వల్ల నేను ఇంతకు మించి ఏం మాట్లాడలేనని న్యాయాధికారి తెలిపారు. మీ సమస్యలు, ఆందోళన ఏంటని వివరంగా రాసి సీల్డ్ కవర్లో పెట్టి జైలు అధికారులకు అందజేయండి. దాన్ని వాళ్లు కోర్టుకు పంపుతారని తెలిపారు. చంద్రబాబు రిమాండ్‌ను నవంబర్ 1 వరకూ పొడిగించింది. అతనితో రోజుకు మూడు ములాఖత్‌లు ఇప్పించాలని ఏసీబీ కోర్టులో ఆయన తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు.