ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులు చేస్తున్న ధర్నాలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసిందని పేర్కొన్న ఆయన ప్రభుత్వం వైఖరితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే.. ఇంకొందరు పుస్తెలు అమ్ముకున్న పరిస్థితి ఉందని అన్నారు.
సర్పంచుల నిరసనకు సంఘీభావంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుందని, అయినా హైకోర్టు అనుమతితో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తోందని అన్నారు. ఈ ధర్నాకు ఎంతో మంది సర్పంచులు పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారని ఆయన అన్నారు. గ్రామం గౌరవం పెరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు గౌరవం ఇవ్వాలన్న రేవంత్ సర్పంచులకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని అన్నారు.
సర్పంచులకు రావాల్సిన నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్న ఆయన చెట్టు చనిపోతే సర్పంచ్ ను సస్పెండ్ చేస్తారట, మరి నిర్లక్ష్యంగా వ్యవహరించిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ ను ఏం చేయాలి? అని ప్రశ్నించారు.
కేటీఆర్ నిర్లక్ష్యం వల్ల మూసీలో మునిగి 30 మంది చనిపోయారని, హైదరాబాద్ లో ఎక్కడ చూసినా మామూలు పరిస్థితులు లేవని అన్నారు. రాష్ట్రాన్ని ఇంత అధ్వాన్నంగా మార్చిన తండ్రీ, కొడుకులను ట్యాంక్ బండ్ మీద ఉరేసినా తప్పు లేదని రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పుట్టబోయే బిడ్డమీద కూడా 1లక్షా 50వేల అప్పు వేశాడని తెలంగాణ మోడల్ అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. బీఆరెస్ అంటే భారత్ రాష్ట్ర సమితి కాదు భస్మాసుర సమితి అని, బుద్ది మార్చుకోకపోతే ఈ భస్మాసుర సమితి కూడా కేసీఆర్ ను కాపడలేదని అన్నారు.