KRNL: పెద్దకడబూరులోని పెద్దబావి సమీపంలో మఠం వద్ద చేతిపంపు చెడగపోయి నెలలు గడుస్తున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారని కాలనీవాసులు బుధవారం వాపోయారు. వేసవి సమీపిస్తున్న వేళ నీటి కట కట మొదలయింది. చేతిపంపు ద్వారా వచ్చే నీటిని కుటుంబ అవసరాలకు వాడుకుందామని ఆశిస్తున్న కాలనీవాసులకు అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
PDPL: రైతులు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారులు సూచించారు. మండలంలోని అందుగులపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇవాళ ఏర్పాటు చేశారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ప్రభుత్వం అందిస్తున్న పథకాలు రైతులకు అందుతాయని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు అవసరమని తెలియజేశారు.
AP: ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకాల ఏర్పాటుపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గొట్టిపాటి సమాధానం ఇచ్చారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ భవనాలపై సౌర ఫలకాలు అమర్చే ప్రతిపాదన ఉందన్నారు. దశలవారీగా సోలార్ ఫలకాలు అమర్చేందుకు టెండర్లు ఆహ్వానించినట్లు మంత్రి వెల్లడించారు.
VZM: విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతిలో బోధించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ బయాలజీ టీచర్స్ ఫోరం రిసోర్స్ పర్సన్ వీరప్పయ్య అన్నారు. జాతీయ సైన్స్ వారోత్సవాల్లో భాగంగా కస్పా పాఠశాలలో సైన్స్ సదస్సును నిర్వహించారు. ఉపాధ్యాయులు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులకు శాస్త్రీయ పద్ధతులలో విద్యను బోధించాలని సూచించారు.
కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లాలో “స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత ప్రయాణించే లారీ, బస్సు, కారు డ్రైవర్లను ఆపి నీళ్లతో ముఖం కడిగించి అలసట తగ్గించి సురక్షితంగా ప్రయాణించాలంటూ పోలీసులు సూచనలు ఇస్తున్నారు.
KNR: చొప్పదండి పట్టణంలోని జడ్పి హై స్కూల్ క్రీడా మైదానం అభివృద్ధికి సహకరించాలని వాకర్స్ క్లబ్ మున్సిపల్ పాలక వర్గానికి విజ్ఞప్తి చేసింది. క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ నూతన పాలక వర్గాన్ని సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ పౌరుల సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్ ఆధునీకరించాలని కోరారు. క్లబ్ అధ్యక్షుడు తాటిపెల్లి అంజయ్య, ప్రధాన కార్య దర్శి పాల్గొన్నారు.
SKLM: సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని టెక్కలి ‘శక్తి టీం’ హెడ్ కానిస్టేబుల్ ఎం.గిరిధర్ అన్నారు. సంతబొమ్మాళి మండలం మర్రిపాడు ప్రభుత్వ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం సైబర్ క్రైమ్, బాల్య వివాహాలు, రోడ్డు భద్రత చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలు దుష్పరిణామాలపై వివరించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ప్రమాదమని, చట్టవిరుద్ధమన్నారు.
NGKL: జిల్లాలో సంచలనం సృష్టించిన KGBV విద్యార్థిని ప్రసవం ఘటనలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది పదో తరగతి పరీక్షల సమయంలోనే నిందితుడు ప్రేమ పేరుతో బాలికను బుట్టలో వేసుకున్నట్లు తేలింది. బాధ్యులను రక్షించేందుకు విద్యాశాఖలో కొందరు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రసవించిన బాలిక సుమారు 2 కిలోల బరువు ఉన్నట్లు సమాచారం.
AP: ధర్నా చేసిన ఉద్యోగులపై గత ప్రభుత్వం కేసులు పెట్టిందని హోంమంత్రి అనిత తెలిపారు. రాజధాని రైతులపై కూడా కేసులు నమోదు చేసిందని విమర్శించారు. విచారణలో 11 కేసులు, పెండింగ్ 39, ముగింపు దశలో 170 కేసులు ఉన్నాయన్నారు. తప్పుడు కేసులు అని తేలితే వెంటనే కేసులు కొట్టివేస్తున్నామని చెప్పారు. కొన్ని కేసులు కోర్టు పరిధిలో ఉన్నందున కోర్టు ఆదేశాల మేరకు క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
TG: నాగర్‌కర్నూల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ పరీక్ష రాసిన 16 ఏళ్ల విద్యార్థిని, కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా అక్కడ బాత్రూంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును తన తల్లితో కలిసి చెత్తబుట్టలో పడేసింది. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేజీబీవీ (KGBV)లో చదువుతున్న ఈ విద్యార్థిని ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.
NTR: MLC మొండితోక అరుణ్ బుధవారం శాసనమండలిలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణంపై ప్రశ్నలు అడగనున్నారు. ఈ మేరకు లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ఎస్.ప్రసన్నకుమార్ వివరాలు వెల్లడించారు. ORR నిర్మించేందుకు NTR జిల్లాలో భూసేకరణ ప్రక్రియ, రైతులకు ఇచ్చే నష్టపరిహారంపై అరుణ్ అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రి జనార్ధనరెడ్డి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
వనపర్తి మండలం రాజనగరం పీఎస్సీఎస్ రైతులకు పంపిణీకి 450 బస్తాల యూరియా సిద్ధంగా ఉందని సీఈవో మహేందర్ తెలిపారు. ఈరోజు 10:30 గంటలకు యూరియా బుకింగ్ యాప్ ఓపెన్ అవుతుందని, అవసరం ఉన్న రైతులు బుకింగ్ చేసుకుని యూరియా పొందాలని కోరారు. యూరియా తీసుకునేందుకు రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్‌లతో రావాలని సూచించారు.
BDK: మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాలస్వామి కళ్యాణం వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సంతాన భాగ్యం కోసం భక్తులు తరలివచ్చి వేణుగోపాలుని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. నేడు స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తిలకించాలని ఆలయ సిబ్బంది తెలిపారు.
MNCL: మందమర్రి పట్టణంలోని శ్రీపతి నగర్‌లో పది రోజుల క్రితం పైప్ లైన్ కోసం తవ్విన గుంతలను అధికారులు పట్టించుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొత్త రోడ్డు వేయడంతో ప్రత్యామ్నాయ దారి లేక ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ప్రమాదాలు జరగకముందే మున్సిపల్ అధికారులు స్పందించి గుంతలను పూడ్చివేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ATP: కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ గురు తిప్పే రుద్రస్వామిని జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ ఛైర్మన్ పూల నాగరాజు దర్శించుకున్నారు. మార్చి 6 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అందరికీ శుభం కలగాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.