NRML: సోమవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం గణితం పత్రం–1 ఏ, వృక్షశాస్త్రం, రాజకీయ శాస్త్రం పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 7,392 మంది విద్యార్థుల్లో 7,075 మంది హాజరై పరీక్ష రాయగా, 317 మంది గైర్హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి పరశురాం తెలిపారు.
HNK: గుడిసె వాసులకు ఇంటి పట్టాలను ఇవ్వాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి అన్నారు. పలివెల్పులలో గుడిసె వాసులతో సీపీఐ నేతలు సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఆచరణలో అరకొర అమలు చేసి గొప్పలు చెప్పుకుంటున్నాయని, స్థానికంగా కనీస మౌలిక సదుపాయాలు సైతం కల్పించకపోవడం బాధాకరమని అన్నారు.
E.G: రాజమహేంద్రవరం బర్మా కాలనీ శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఆధ్వర్యంలో సోమవారం పుష్కరాల రేవులో సలాలా పండుగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రాజమహేంద్రవరం సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించారు.
NLG: దామెర భీమనపల్లిలో రహదారిపై ఉన్న గుంతలను సర్పంచ్ జిల్లా అలివేలు ఆధ్వర్యంలో పూడ్చివేయించారు. గ్రామంలోని 6వ వార్డులో రోడ్డు అధ్వాన్నంగా తయారై ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఆమె స్పందించారు. సొంత చొరవతో మట్టి పోయించి గుంతలను పూడ్చి రోడ్డును చదును చేయించారు. గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని స్థానికులు కోరారు.
HNK: పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలను సాధించాలని తహసిల్దార్ విజయలక్ష్మి అన్నారు. పరకాల గర్ల్స్ హై-స్కూల్ లోని 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదవాలని, చదువు మన తలరాతను మారుస్తుందని తహసిల్దార్ అన్నారు. ఆర్ఐ దామోదర్, స్కూల్ ఇన్‌ఛార్జ్ పద్మజ, ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు కళ్యాణ్ ఉన్నారు.
SRPT: భూ రిజిస్ట్రేషన్ వివాదంలో మాజీ కౌన్సిలర్ నెమ్మది బాబుపై దాడికి పాల్పడి, కులం పేరుతో దూషించిన ఘటనలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ వంగవీటి రామారావు, ఆయన కుమారుడిపై కేసు నమోదైంది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ శిక్షణ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపారు.
VKB: అనంతగిరిలో నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరానికి విచ్చేసిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఎస్ఏపీ కళాశాల హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం అనన్య ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు.
PLD: వినుకొండ శివారు పసుపులేరు బ్రిడ్జి వద్ద సోమవారం వేగంగా వచ్చిన కారు, బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బాధితుడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
BDK: మణుగూరు మండలం రామానుజవర గ్రామ సమీపంలో ప్రధాన రహదారి గుంతలతో ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా తక్షణం స్పందించి 50 లక్షల వ్యయంతో మరమ్మత్తులు పనులను చేపట్టారు. ఈ పనులను సోమవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యక్షంగా పరిశీలించారు. పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ASR: ఉపాధి హామీ పథకం కింద వెంటనే ఉపాధి పనులు కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. డుంబ్రిగుడ మండలం తూటంగి పంచాయతీ లాసేరు, బల్డ్‌గడ్డ గ్రామాల్లో సోమవారం సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కూలీలకు రోజుకు రూ.600 కనీస వేతనం చెల్లించాలని, ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలని కోరారు.
MDK: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఇటీవల కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రతిమ సింగ్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆమెతోపాటు జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాస్ రావు, డీఆర్ భుజంగ రావు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
ఆసిఫాబాద్ జిల్లాలోని కైర్గాం జాతీయ రహదారిపై సోమవారం ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే 108కి సమాచారం అందించారు. గాయపడిన వ్యక్తిని ఆసిఫాబాద్ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. సమయానికి వైద్య సహాయం అందడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
TPT: నాయుడుపేట డీఎస్పీ పర్యవేక్షణలో వెంకటగిరి పట్టణంలోని టిడ్కో హౌసెస్, ఎన్‌టీఆర్ కాలనీలో విస్తృత స్థాయిలో కార్డన్ & సెర్చ్ నిర్వహించారు. మొత్తం 112 ఇళ్లను తనిఖీ చేసి అనుమానితుల వేలిముద్రలు సేకరించి, ఆధార్ వివరాలు పరిశీలించారు. సరైన పత్రాలు లేని 17 మోటార్ సైకిళ్లు, ఒక ఆటో, 18 వాహనాలను సీజ్ చేశారు. నేర నియంత్రణలో భాగంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు.
ATP: జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కు 140 పిటిషన్లు అందాయి. జిల్లా ఎస్పీ పి. జగదీష్ బాధితులతో ముఖాముఖి మాట్లాడి కుటుంబ కలహాలు, రస్తా వివాదాల వంటి సమస్యలను స్వయంగా విన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.