KNR: హోలీ పండగని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా ప్రజలకు సీపీ గౌష్ ఆలం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ పండుగ సోదరభావానికి ప్రతీక అని, ప్రజలందరూ శాంతియుత చట్టబద్ధంగా వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కమిషనరేట్ పరిధిలో పలు సూచనలు చేశారు. చర్మం, కళ్లకు హాని చేసే రసాయనిక రంగులను కాకుండా, సహజ సిద్ధమైన రంగులను వాడాలన్నారు.
GNTR: తెనాలి పట్టణ తెలుగు యువత ఆధ్వర్యంలో సోమవారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఆయన ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసిన నిర్వాహకులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) రూపొందించిన PSLV రాకెట్ ప్రయోగాల్లో ఒకే రకమైన సాంకేతిక లోపంతో ఏర్పడింది. రెండు ప్రయోగాలు విఫలం కావడంతో 3 నెలల పాటు ప్రయోగాలకు ఇస్రో బ్రేక్ వేసింది. గతేడాది మేలో PSLV C61, ఈ ఏడాది జనవరిలో PSLV C62 రాకెట్‌లు విఫలమైన తర్వాత మళ్లీ ప్రయోగాల జోలికి పోలేదు. గగన్‌యాన్ ప్రాజెక్టు ప్రయోగాలు కూడా ఆలస్యమయ్యే అవకాశముంది.
అనంతపురం సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఎండీ.ఇమామ్ వికారాబాద్‌లో పది రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఇమామ్‌కు ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. ఏపీలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, ప్రజలతో మమేకం కావాలని రాహుల్ దిశానిర్దేశం చేశారు.
W.G: 2029 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే గంగమ్మ తల్లి జాతరలో పాట్టెళ్ల తలలు నరికినట్లు ప్రజలను నరికేస్తాం అంటున్న వైసీపీ నినాదాలు వారి రాక్షసత్వానికి పరాకాష్ట అని మంత్రి రామానాయుడు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2019లో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అవినీతి పాలనతో దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని దివాలా తీసారని విమర్శించారు.
MBNR: మన్యంకొండలో శ్రీ అలివేలు మంగమ్మ దేవాలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి హనుమద్వాహన సేవ అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన హనుమంత వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారిని ఆలయ వీధుల్లో ఊరేగించగా, భక్తులు జైజైధ్వానాలతో నీరాజనాలు పలికారు.
KMR: నస్రుల్లాబాద్ మండలం దుర్కి సోమలింగేశ్వర ఆలయ కమిటీ ఛైర్మన్‌గా దుర్గం మహేష్ పటేల్‌ను ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో సోమవారం నియమించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ కమల, ఆలయ పునర్నిర్మాణ దాత పోచారం శంభు రెడ్డి, మహేందర్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ శ్యామల, జడ్పీటీసీ మాజీ సభ్యులు లక్ష్మి కిషోర్, మాజీ ఎంపీపీ విటల్, మాజీ సర్పంచ్ మోహన్ ఉన్నారు.
W.G: 2027లో జరగనున్న పుష్కరాల సన్నాహకలపై భీమవరంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఘాట్ల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రహదారి మరమ్మతులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తాత్కాలిక మరుగుదొడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రత వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
MDK: బోయిన్‌పల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి వీ. నీలిమ తెలిపారు. గిరిజన బాలబాలికలకు కాయాకింగ్, కెనోయింగ్, రోయింగ్, ఫెన్సింగ్ వంటి క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
SDPT: గజ్వేల్ నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ. 50 లక్షలు మంజూరు చేస్తూ జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశాలు జారీ చేశారు. వర్గల్ మండలం సీతారాంపల్లి, నాచారం, జగదేవపూర్ మండలం చాట్లపల్లి, గజ్వేల్ మండలం దాతర్ పల్లి, కొండపాక మండల కేంద్రానికి నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
BPT: కారంచేడు-పర్చూరు రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కారంచేడు నుండి పర్చూరు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రైవేటు వాహనంలో చీరాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రకాశం జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి సోమవారం అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు, విద్యార్థులకు తాగునీరు, రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
కృష్ణా: మిత్రుడు తీసుకెళ్లిన ఫోన్ తిరిగి అందకపోవడంతో ఏర్పడిన మానసిక ఒత్తిడి ఓ యువకుడి ప్రాణాలను తీసింది. పోలీసుల సమాచారం మేరకు NTR (D) చందర్లపాడు(M) చింతలపాడుకి చెందిన బత్తుల నరసింహారావు (19) కొంతకాలంగా పునాదిపాడులో అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నాడు. ఇటీవల వణుకూరు చెందిన స్నేహితుడు అతని ఫోన్ తీసుకెళ్లగా, పలుమార్లు కోరినా స్పందన లేకపోవడంతో సూసైడ్ చేసుకున్నాడు.
ATP: పాఠశాలలకు హోలీ పండుగ సెలవు మంగళవారమే ఉంటుందని జిల్లా విద్యాశాఖాధికారి ప్రసాద్ బాబు ప్రకటించారు. గతంలో మార్చి 4న సెలవుగా ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మార్చి 3నే సెలవు అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. బుధవారం నుంచి పాఠశాలలు యథాతథంగా పనిచేస్తాయని ఆయన తెలిపారు.
హోలీ ఎప్పుడు జరుపుకోవాలని చాలా మంది అయోమయంలో ఉన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ క్యాలెండర్ల ప్రకారం ఇవాళ పబ్లిక్ హాలిడే ఉంది. స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు తెలంగాణ సర్కారు హాలిడే ప్రకటించింది. మద్యం దుకాణాలు రేపు ఉదయం 6 గంటల వరకు మూసి ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, ఇవాళ చంద్రగ్రహణం ఉండటంతో రేపు హోలీ పండుగ చేసుకోవాలని పండితులు చెబుతున్నారు.