HYD: మెట్రో పరిసర ప్రాంతాల్లో రాత్రి సమయంలో మహిళలకు భద్రత కరువైనట్లు ఈథేమ్స్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు నిర్వహించిన సర్వేలలో తేలింది. చీకటి పడిన తర్వాత వేధింపులకు ఎదుర్కొన్నామని 11 శాతం చెప్పారు. భయం కారణంగా చాలా మంది ఫిర్యాదులు చేయడం లేదు. HYD నగరం సహా, మన దేశంలోని 15 మెట్రో నగరాల్లో అధ్యయనం చేసి ఈ బృందం విశ్లేషణ జరిపినట్లు పేర్కొంది.
NLG: మంత్రి క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉదయం నుంచి మంత్రి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలను తెలుసుకున్నారు. వృద్ధులు, మహిళలు, పట్టణానికి చెందిన పలువురు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. వీటిపై ఆయన వినతులు స్వీకరించారు.
MHBD: లంబాడీలు దేశానికే మార్గదర్శకులు కావాలని మహబూబాబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత అన్నారు. మహబూబాబాద్‌లో ఆదివారం నిర్వహించిన లంబాడీల ఆత్మగౌరవ సభలో పాల్గొని వారు మాట్లాడారు. లంబాడీలను ఎవరైనా కించపరిచినట్లు మాట్లాడినా, రిజర్వేషన్ జోలికి వచ్చిన ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇటీవల పలువురు ఎస్టీ రిజర్వేషన్ తొలగించాలని చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు.
RR: షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందిగామ పాఠశాలను తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు.
NLG: మిర్యాలగూడ ఆర్టీసీ బస్ స్టేషన్‌ను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కలిసి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్‌కు మరమ్మతు పనులు చేయాలని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అదేశించారు. బస్టాండ్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
E.G: గోదావరి వరదల కారణంగా తూ.గో జిల్లాలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజల రక్షణకు ప్రతి శాఖ సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదివారం ఆదేశించారు. బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించి సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
SS: జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలో ఆదివారం వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. గతంలో గోరంట్ల ఎస్సైగా పని చేసిన ఈయన గుత్తి మండలానికి బదిలీపై వెళ్లారు. ఇప్పుడు పదోన్నతిపై మళ్ళీ శ్రీ సత్యసాయి జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా వచ్చారు.
ADB: కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు మేలు చేకూరుతుందని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. ఆదివారం బోథ్ మండలంలో పర్యటించి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులతో మాట్లాడారు. పేదింటి కుటుంబానికి సొంత ఇంటి కలను సహకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. దశల వారీగా అర్హులందరికీ ఇళ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ASR: భగత్ సింగ్ యుక్త వయసులోనే యూరోపియన్ విప్లవ ఉద్యమాల గురించి చదివి, సోషలిజం వైపు ఆకర్షితులయ్యారని గిరిజన సమాఖ్య కార్యదర్శి రాధాకృష్ణ, మూల నివాసి సంఘ్ కార్యవర్గసభ్యుడు వైకుమార్ అన్నారు. ఆదివారం భగత్ సింగ్ జయంతిని పాడేరులో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మనుషులను చంపగలరు కానీ వారి ఆశయాలు చంపలేరని చాటి చెప్పారని కొనియాడారు.
KMM: అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు అని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తెలిపారు. ఆదివారం కారేపల్లి మండలం భాగ్యనగర్ తండా నుంచి పోలంపల్లి వరకు రూ.70 లక్షల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
VSP: విశాఖలోని 65వ వార్డులో స్వస్థ్ నారి స్వశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రియదర్శిని కాలనీలోని పబ్లిక్ హెల్త్ సెంటర్ మహిళలకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించి, మెడికల్ ఆఫీసర్, ఆసుపత్రి సిబ్బంది అవసరమైన వారికి తగిన సూచనలు, సలహాలు అందించారు.
కోనసీమ: మహాకవి, కవి కోకిల గుర్రం జాషువా 130వ జయంతి భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా కడియం గ్రామంలోని గురజాల కృష్ణ ప్రసాద్ కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా మండపేట పట్టణానికి చెందిన గండి స్వామి ప్రసాద్‌కు చెళ్లపిళ్ల కళా సేవా సమితి తూర్పుగోదావరి జిల్లా ఆద్వర్యంలో మహాకవి గుర్రం జాషువా సాహితీ పురస్కారాన్ని అందజేశారు.
MBNR: దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై సంపూర్ణంగా ఉండాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి ఆహ్వానం మేరకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కొత్తచెరువు రోడ్డులో ఉన్న దుర్గామాత మండపాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు సుఖసంతోషాలతో దసరా పండుగలు జరుపుకోవాలన్నారు.
VZM: డెంకాడలో వైసీపీ డిజిటల్ బుక్‌ను మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఆదివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోందన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎటువంటి అన్యాయాలు జరిగినా డిజిటల్ బుక్‌లో నమోదు చేయాలని పిలుపునిచ్చారు.
HYD: హిమాయత్ నగర్ తిరుమల తిరుపతి దేవస్థానం లోకల్ అడ్వయిజరి కమిటీ ఛైర్మన్ బాధ్యతలకు రాష్ట్ర జనసేన పార్టీ ఇంఛార్జి శంకర్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రేటర్ హైదరాబాద్ నేతలు పాల్గొన్నారు.