JGL: రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో ఆదివారం నక్కలగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండుగలా నిర్వహించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల సౌజన్యంతో మహా అన్నదానం, రథోత్సవం తదితర కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు అర్చకులు వెంకట కృష్ణ తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.
AP: అసెంబ్లీ ఆమోందించిన 7 బిల్లులను ఇవాళ శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. పురపాలక శాఖకు సంబంధించి 2 చట్టసవరణ బిల్లులు, దేవదాయ శాఖకు సంబంధించి 2, విద్యుత్, పంచాయతీరాజ్ శాఖల చట్టసవరణ బిల్లులు, వైద్యారోగ్య శాఖకు సంబంధించిన బిల్లులను మండలి ముందుకు తీసుకురానుంది. ఈ క్రమంలో శాంతిభద్రతలపై మండలిలో లఘు చర్చ జరగనుంది.
కోనసీమ: APSSDC ఆధ్వర్యంలో అమలాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు DSDO హరి శేషు సోమవారం తెలిపారు. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కోసం పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెంలోని జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థాన ఆవరణలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. ఆలయానికి వచ్చిన మహిళా భక్తురాలు వద్ద మద్యం సేవించిన వ్యక్తి రూ. 5000 అపహరించారు. దీనిని పసిగట్టిన మహిళ అక్కడే ఉన్న సిబ్బందికి తెలియజేశారు. దీంతో అతడిని సిబ్బంది పట్టుకుని అతని వద్ద ఉన్న రూ. 2,000లను తిరిగి ఇప్పించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VKB: బషీరాబాద్ మండల కేంద్రంలోని రైల్వే గేట్ సమీపంలో సూచిక బోర్డులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మూలమలుపు నుంచి జీవంగి, ఇందర్చేడు, నవాంగి గ్రామాలకు వెళ్లే మార్గాలు ఉండటంతో కొత్త వాహనదారులు ఏ దారి ఎటువైపు వెళ్తుందో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
RR: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో రజక కుటుంబంపై దాడి చేసి పసికందును హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కేశంపేటలో BC, SC, ST-JAC, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాధితులకు న్యాయం చేసి మర్డర్ కేసు నమోదు చేయాలని నాయకులు కోరారు. మహిపాల్ మహారాజ్, రాములు, రమేశ్ తదితరులు ఉన్నారు.
MBNR: జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్‌లో DDU -GKY& స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో యువతులకు నర్సింగ్ అసిస్టెంట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కో-ఆర్డినేటర్ రవి తెలిపారు. టెన్త్ పాసైన వారు అర్హులని, ఎంపికైన వారికి ఉచిత శిక్షణతో పాటు వసతి, భోజనం, మెటీరియల్ సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ నెల 23 లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
MNCL: గ్రామ పంచాయతీల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా జన్నారం మండల సర్పంచులు సిద్ధమయ్యారు. మంచిర్యాల ఇంజనీరింగ్ కళాశాల వేదికగా సోమవారం నుంచి ప్రారంభం కానున్న ‘సర్పంచుల శిక్షణ తరగతుల’ను సర్పంచులందరూ ఏకతాటిపైకి వచ్చి విజయవంతం చేయాలని జన్నారం మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుదిరే వెంకన్న కోరారు.
AP: ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్ పరీక్షలు ఒక మైలురాయి. ఈ పరీక్షలు భవిష్యత్ విద్యా, వృత్తి అవకాశాలకు మార్గం సుగమం చేస్తాయి. కాబట్టి విద్యార్థులు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రశ్నలను జాగ్రత్తగా చదివి సమాధానాలు రాయాలి. మీ కష్టానికి తగిన ఫలితాలు రావాలని కోరుకుంటూ.. హిట్ టీవీ తరఫున ALL THE BEST
ASF:మహిళా సంఘ భవనాల నమూనాలో మరుగుదొడ్ల నిర్మాణానికి చోటు లేని విషయం వాస్తవమేనని ఆసిఫాబాద్ జిల్లా DRDO దత్తారావు ప్రకటనలో తెలిపారు.కానీ మహిళలు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్వచ్చ భారత్ మిషన్లో భాగంగా పంచాయతీల నుంచి తీర్మానాలు స్వీకరించి మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. ఇప్పటికే దాదాపు అన్నిచోట్ల భవనాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.
ELR: విదేశాల్లో వైద్య పీజీ సీట్లు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నిలువునా ముంచిన ఘటన జంగారెడ్డిగూడెంలో వెలుగుచూసింది. పట్టణానికి చెందిన షంషీర్ అహ్మద్ కుమార్తె, మేనల్లుడికి సీట్ల కోసం మహబూబ్ నగర్‌కు చెందిన గుండా రాఘవ రూ.19.50 లక్షలు వసూలు చేశాడు. పలుదఫాలుగా నగదు తీసుకొని సీట్లు ఇప్పించకుండా పట్టించుకోకపోవడంతో బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు.
PDPL: రాయికల్ మండలం కట్కాపూర్, బీర్పూర్ మండల పరిధిలోని రంగాసాగర్, కండ్లపెళ్లి, మంగెల గ్రామాల సరిహద్దుల్లో వెలసిన శ్రీ గొల్లకేతమ్మ మల్లన్న స్వామి జాతర ఉత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. మహిళలు నెత్తిన బోనాలతో ఊరేగింపుగా వచ్చి మల్లన్నకు నైవేద్యం సమర్పించగా, లగ్న పట్నం కార్యక్రమం కన్నుల పండుగలా సాగింది.
కృష్ణా: ఉయ్యూరు రైతు బజార్లో సోమవారం అధికారులు తాజాగా కూరగాయల ధరల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఫ్రెంచ్‌బీన్స్, కాప్సికం కిలో రూ.62తో అత్యధికంగా నమోదు కాగా, క్యారెట్ రూ.26, టమాటా రూ.15, బీరకాయ రూ.24గా నిర్ణయించారు. పచ్చిమిర్చి రూ.45, వంకాయ రూ.20–22, దొండకాయలు రూ.32, బెండకాయ రూ.24, బంగాళాదుంప రూ.24, బీట్‌రూట్ రూ.28, ఉల్లిపాయలు రూ.23, దోస రూ.26గా ఉంది.
SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక ‘మీ కోసం’ నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
KKD: ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న కోడిపందేల స్థావరంపై ఎస్సై లక్ష్మీకాంతం ఆదివారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రెండు కోడిపుంజులు, రూ.2,550 నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.