MDK: తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై చేపట్టిన ‘చలో HYD’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. సోమవారం HYDకు తరలివెళ్తున్న ఆశా వర్కర్లను టేక్మల్ పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. గౌరవ వేతనం పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు సిద్ధమయ్యారు. పోలీసులు వారిని అడ్డుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
GDWL: ఇంటర్ పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిపాదిత కళాశాలల కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం గద్వాలలో ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలల్లో పరీక్షల ఏర్పాటు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.
AP: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆహారభద్రతపై నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పు అని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని కోరారు.
MNCL: జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చీఫ్ సూపర్డెంట్ బాపురావు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ.. బుధవారం నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. మొదటి సంవత్సరంలో 125 మంది, రెండో సంవత్సరంలో 120 మంది మొత్తం 245 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
కుంకుమపువ్వు మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే ప్రత్యేక మూలకాలు రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచే ఈ కుంకుమపువ్వును నిత్యం పాలు, టీ రూపంలో తీసుకోవాలి. చర్మం నిగారింపునకు తోడ్పడుతుంది. రోజుకు 30mg కంటే ఎక్కువ తీసుకోవద్దు.
NRPT: కావలి మల్లప్ప అనే రైతు మద్దూరు శివారు కాజీపురం రోడ్డులోని పొలం వద్ద 4 ఎద్దులను గుడిసెలో కట్టివేశాడు. దోమల బెడద తగ్గించేందుకు ఆదివారం మంట పెట్టి రాత్రి 9:30 గంటలకు ఇంటికి వెళ్లాడు. ఇదే సమయంలో గుడిసెకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. దీంతో గుడిసెలో ఉన్న 3 ఎద్దులు తాడు తెంచుకుని బయటపడగా, ఒక ఎద్దు అక్కడికక్కడే కాలిపోయి మృతిచెందింది. దీంతో రైతు కన్నీరుమున్నీరుగా విలపించాడు.
NZB: రాష్ట్రంలో గిరిజన అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ధర్పల్లిలోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
Akp: జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని నర్సీపట్నం ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర పిలుపునిచ్చారు. నర్సీపట్నంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 5వ విడత సభ్యత్వ నమోదు ప్రారంభమవుతుందని తెలిపారు. ఉద్యమి, సాధక్, ప్రధాతగా మూడు వర్గాలుగా సభ్యత్వాన్ని విభజించినట్లు పేర్కొన్నారు. కరపత్రాలను విడుదల చేశారు.
శ్రీకాకుళం ప్రభుత్వ ఉమెన్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును ఆయన సంబంధిత గదులకు వెళ్లి పరిశీలించారు. విద్యార్థులకు త్రాగునీటి సదుపాయం వైద్య సదుపాయం పక్కాగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడరాదన్నారు.
BDK: బూర్గంపహాడ్ మండలం, బట్టిగూడెం గ్రామంలో పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు ఫారెస్ట్ అధికారుల చర్యలపై సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను ఉప సర్పంచ్ భూక్య మోహన్ రావుకు తెలియజేయగా, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తమ జీవనాధారాన్ని కాపాడాలని అధికారులను కోరుతున్నారు.
NLR: మనుబోలు మండలం పిడూరుపాలెం పొలాల్లో సోమవారం కోడిపందాలు నిర్వహించారు. పక్కా సమాచారంతో పోలీసులు డ్రోన్ కెమెరా ప్రయోగించారు. కోడిపందాలు ఆడుతున్న వారిని గుర్తించి, 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 21 బైకులు, రూ. 800 నగదు, 5 కోళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై శివ రాకేష్ తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక TDP కార్యాలయంలో నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
AP: తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరిచింది. ఏకసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఓవర్‌లాపింగ్ కిందకు రాదని తేల్చింది. పరిపాలనాపరమైన లోపాల గుర్తింపునకు ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఈ మేరకు సుబ్రహ్మణ్యస్వామి వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
NLR: 15 ఏళ్లుగా మూతపడి వేలాది కుటుంబాలను రోడ్డున పడేసిన షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శాసనసభలో సోమవారం గళమెత్తారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో దాదాపు 3 వేల మంది కార్మికులు పని చేసేవారన్నారు.పెండింగ్‌లో ఉన్న కోట్లాది రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.
ప్రకాశం: కొమరోలు మండలంలోని మాధవపల్లె గ్రామ సమీపంలోని క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సూరే శివ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.