NRML: తమ సమస్యలను పరిష్కరించాలంటూ కోరుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిర్మల్ జిల్లా ఆర్డీవో కార్యాలయం ముందు చేపట్టిన రిలే దీక్ష బుధవారం ఆరవ రోజుకు చేరింది. కాగా టీఎన్జీవో నాయకులు వారి రిలే దీక్షకు మద్దతు తెలిపారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ మాట్లాడుతూ… ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలని కోరారు.
కృష్ణా: నూజివీడు మండలం పోలసానపల్లిలో రహదారిపైనే నీటి గుంత ఏర్పడింది. స్థానికులు గృహాల్లో వాడిన నీరు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో తారు రోడ్డుపైకి వచ్చి చేరుతోంది. దీంతో వాహనాల ధాటికి నీరు చేరిన తారు రోడ్డు గుంతలు పడి ధ్వంసం అవుతుందని, ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోయారు. రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ELR: దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలో బుధవారం రెవిన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. ఈ రెవెన్యూ సదస్సులో ప్రజలు, రైతులు వారి భూమి సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. వారి సౌలభ్యం కోసమే రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
SRD: సిర్గాపూర్ మండలంలోని గ్రామాల్లో నేటి నుంచి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులపై పంచాయతీ కార్యదర్శులు సర్వే చేపడుతున్నారని ఎంపీడీవో మల్సూర్ నాయక్ తెలిపారు. బుధవారం స్థానిక కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రజాపాలన కార్యక్రమంలో గతేడాది దరఖాస్తు పెట్టుకున్న లబ్ధిదారుల వివరాలను సేకరించి, మొబైల్ యాప్‌లో సెక్రటరీలు నమోదు చేస్తారని తెలిపారు.
HYD: నలుగురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు డ్రగ్స్ వ్యాపారం చేస్తూ పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఎస్ఆర్ నగర్‌లోని ఓ బాయ్స్ హాస్టల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆదర్శ్, శ్రీకాంత్, అజయ్, సంజయ్ ఉంటున్నారు. మొదట డ్రగ్స్‌కి బానిసలై ఆ తర్వాత డ్రగ్స్ వ్యాపారం మొదలు పెట్టారు. వీరిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు వారి నుంచి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.
NDL: పట్టణం రైల్వే కాలనిలోని కోదండ రామాలయం నందు రైల్వే రిటైర్డ్ ఉద్యోగి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో గీత జయంతిని ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భగవద్గీత పారాయణం చేశారు. అనంతరం అన్న ప్రసాద వితరణ చేశారు. గత 14 సంవత్సరాలుగా గీతా జయంతిని నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.
శనివారం నుంచి ఆస్ట్రేలియా- భారత్ మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గబ్బా పిచ్ పరిస్థితిపై క్యురేటర్ డేవిడ్ సందుర్స్కి స్పందించాడు. గతంలో మాదిరిగానే బౌన్సీ పిచ్‌ను తయారు చేసినట్లు తెలిపాడు. అలాగే, బ్యాటర్లకూ సహకరిస్తుందనే సంకేతాలు ఇచ్చాడు. కాగా, ఇప్పటికే తొలి రోజు టికెట్లన్నీ బుక్ అయినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
VZM: భూ సమస్యలను ప్రజలు రైతులు సత్వరమే పరిష్కరించుకోవాలని విజయనగరం రెవెన్యూ డివిజనల్ అధికారి దాట్ల కీర్తి కోరారు. బుధవారం బొండపల్లి మండలంలోని కిండాం అగ్రహారం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దరఖాస్తులను స్వీకరించారు.
VZM: విజయనగరం పట్టణంలోని మహిళా ప్రాంగణం నుండి మాంగో మార్కెట్‌కి వెళ్లే రహదారిలో ఓ కారు అనుమానస్పదంగా పార్క్ చేసి ఉంది. సుమారు నెల రోజులుగా కారు అక్కడే ఉందని, ఎవరిదో తెలియడం లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైందా? లేక ఎవరైనా దొంగలించి అక్కడ వదిలేసారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులు స్పందించి ఆరా తీయాలని స్థానికులు కోరుతున్నారు.
NZB: చందూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బుధవారం సీఎం కప్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో నీలావతి ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలుమానసిక వికాసానికి ఆరోగ్యానికి అత్యంత ఉపయోగకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
AKP: అచ్యుతాపురం మండలం వెదురువాడలో భూసమస్యలు పరిష్కరించాలని బుధవారం సీపీఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. సీపీఎం మండల కన్వీనర్ రాము మాట్లాడుతూ.. వెదురుపల్లి సర్వే నెంబరు 1లో 143 మంది పేదలకు 100 ఎకరాలు 2005లో అప్పటి ప్రభుత్వం భూములు పంచి పట్టాలు మంజూరు చేసిందన్నారు. మీరు వేసుకున్న జీడి మామిడి మొక్కలు తొలగించి ఇప్పటికీ నష్టపరిహారం అవ్వలేదన్నారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2024లో మధ్యప్రదేశ్ సెమీస్‌కు చేరుకుంది. అయితే క్వార్టర్ ఫైనల్లో వెంకటేశ్ అయ్యర్ ఆల్‌రౌండ్ షోను ప్రదర్శించాడు. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ బ్యాటింగ్, బౌలింగ్‌లో తన సత్తా చాటాడు. రెండు వికెట్లు తీసిన వెంకటేశ్, బ్యాటింగ్‌లోను తన ప్రతిభను కనబరిచాడు. 38 పరుగులు చేసి నాట్‌ఔట్‌గా నిలిచాడు.
KDP: గన్‌తో బెదిరించి ఓ వ్యక్తిని తీవ్రంగా గాయపరిచిన ఘటన బుధవారం పులివెందుల మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటంబ సభ్యుల వివరాల ప్రకారం.. తుమ్మలపల్లెకి చెందిన నాగిరెడ్డి అనే వ్యక్తిని శివ, బబ్లు అనే ఇద్దరు యువకులు గన్‌తో బెదిరించి తీవ్రంగా గాయపరిచారు. దీంతో నాగిరెడ్డికి తీవ్ర గాయాలు కాగా.. స్థానికులు వెంటనే అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజస్థాన్‌లోని జైపూర్‌కు చేరుకున్నారు. రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్.. రేవంత్ రెడ్డికి స్వాగతం పలికారు. బంధువుల వివాహం కోసం సీఎం రేవంత్ జైపూర్ వెళ్లారు. కుటుంబసభ్యులతో కలిసి వివాహ వేడుకలో పాల్గొననున్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు.
ASF: ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల ధనోరాలో ఉర్దూ మీడియం, తెలుగు మీడియం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే బుధవారం తనిఖీ చేశారు. ప్రతీరోజు నిర్వాహకులు మధ్యాహ్న భోజనాన్ని రుచిగా వండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు.