ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత, జనాల్లోకి వెళ్లబోతుంది. తొలి బహిరంగ సభను ఈ నెల 18వ తేదీన నిర్వహించబోతుంది. ఖమ్మంలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. ఆ ప్రాంగణంలోనే భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు. సభ వేదికపై ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు, కీలక నేతలతో కేసీఆర్ ఉంటారు. నిన్న (ఆదివారం) రోజున జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు సహా ఇతర నేతలతో సీఎం కేసీఆర్ సమావేశం అయ్యారు. సభ గురించి వారితో డిస్కసన్ చేశారు. వేదిక, అతిథులు రాక, ఏర్పాట్ల గురించి మాట్లాడారు. జాతీయ పార్టీగా మారిన తర్వాత తొలి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, విజయవంతం చేయాలని స్పష్టంచేశారు.
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష పదవీని తోట చంద్రశేఖర్ కు అప్పగించారు. ఆ రోజే బీఆర్ఎస్ పార్టీలో చేరిన రావెల కిశోర్ బాబు సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకుంటాం అని కేసీఆర్ స్పష్టంచేశారు. పొరుగు రాష్ట్రంలో పార్టీ విస్తరణ ప్రక్రియ జరుగుతుంది. ఇతర రాష్ట్రాల ముఖ్య నేతలతో కూడా తరచుగా సంప్రదింపులు జరుపుతున్నారు. 18వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సభ వేదికపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, మాజీ సీఎంలు అఖిలేశ్ యాదవ్, కుమార స్వామి ఇతర బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు ఉంటారు.
తొలి బహిరంగ సభను ఢిల్లీలో నిర్వహించాలని కేసీఆర్ అనుకున్నారు. చివరి క్షణంలో రాష్ట్రంలో నిర్వహించాలని భావించారు. 18వ తేదీన సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన ఉంటుంది. నూతన కలెక్టరేట్ ప్రారంభిస్తారు. ఆ తర్వాతే బహిరంగ సభ ఉండనుంది. వేదికపై ముఖ్య నేతలు ఉండగా, తమ పార్టీ విధానాన్ని కేసీఆర్ మరోసారి చెబుతారు. వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై శ్రేణులకు నిర్దేశనం చేస్తారు. సభ ద్వారా తెలంగాణ గట్టు మీద ఎన్నికల ప్రచార పర్వానికి కేసీఆర్ తెరతీసే అవకాశం ఉంది. ఈ ఏడాది డిసంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక జరగనుంది. 11 నెలల సమయం ఉన్నా.. కేసీఆర్ జనాల్లోకి ముందే వెళ్లే ఛాన్స్ ఉంది. కర్ణాటకలో మే నెలలో ఎన్నిక జరగనుంది. అప్పుడే ముందస్తు కోసం వెళతారని ఆనలిస్టులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన తొలి సభను కూడా ముందుగానే రద్దుచేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ తొలి సభ కోసం భారీగా జన సమీకరణపై నేతలు ఫోకస్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగారు. ఖమ్మం జిల్లా కాక సూర్యాపేట, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేయనున్నారు. రాష్ట్రంలో వరసగా మూడోసారి అధికారం చేపట్టడంతోపాటు.. జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటాలని కేసీఆర్ ప్రణాళిక రచించారు. అందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేల చేత పరుగులు పెట్టిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పదే పదే గుర్తుచేస్తున్నారు. ఏడాదిలోపే ఎన్నిక రావడంతో అందరినీ యాక్టివ్ చేస్తున్నారు. ఈ సభ ద్వారా శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరుతున్నారు. విభేదాలను పక్కనబెడితేనే విజయవకాశాలు మరింత మెరుగుపడతాయని గుర్తుచేస్తున్నారు. ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో ఇదే విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు కూడా అందరికీ చెబుతూ.. ముందుకు నడుస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి కేజ్రీవాల్, అఖిలేశ్ యాదవ్, కుమార స్వామి లాంటి నేతలు సపోర్ట్ చేస్తున్నారు. అఖిలేశ్, కుమారస్వామి అయితే కేసీఆర్ తో టచ్ లో ఉన్నారు. కానీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాత్రం దూరంగా ఉంటున్నారు. పార్టీ ఏర్పాటుకు ముందు, ఫెడరల్ ఫ్రంట్ అని కేసీఆర్ హడావిడి చేశారు. ఆ సమయంలో ఆ ఇద్దరూ నేతలు తల ఊపారు. కానీ తర్వాత మాత్రం డిస్టన్స్ మెయింటెన్ చేశారు. ఇదీ బీఆర్ఎస్ పార్టీకి కాస్త నెగిటివ్ కానుంది. మిగిలిన అంశాలు అన్నీ కూడా పాజిటివ్ అవుతాయి. కానీ వచ్చే లోక్ సభ ఎన్నికల సమయం నాటికి బీఆర్ఎస్ పార్టీకి జనం ఆదరణ ఆశించిన స్థాయిలో ఉంటుందా..? అంటే అంచనా వేయడం కాస్త కష్టమేనని విశ్లేషకుల అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో దక్కిన ఫలితం, గౌరవం లభిస్తాయా అనే ప్రశ్న సగటు జీవి మెదడులో కూడా తలెత్తుతోంది. మరీ దీనికి మరికొన్ని నెలల్లో సమాధానం దొరకనుంది.