ఏదో ఒక సమయంలో ప్రతీ ఒక్కరు వివక్షకు గురవుతారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. అప్పుడే దాని గురించి తెలుస్తుందని వివరించారు. తాను కూడా వివక్షకు గురయ్యానని చెప్పారు. బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ప్రయాణిస్తున్న సమయంలో తనకు నీళ్లు ఇవ్వడానికి ఓ బ్రిటీష్ మహిళ నిరాకరించారని గుర్తుచేశారు. వ్యక్తి ఆరాధన ప్రమాదకరం అని పవన్ కల్యాణ్ అన్నారు. సమాజాన్ని సమగ్రంగా చూడాలని చెప్పారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో బుధవారం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించొద్దని పవన్ చెప్పారు. బయట ఉండే శత్రువుల కన్నా మనతో ఉండే శత్రువులతో ప్రమాదం ఎక్కువని చెప్పారు. రాష్ట్రంలో ఎస్పీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలను తీసేశారు. ఇది మంచి పద్దతి కాదని పవన్ హితవు పలికారు. ప్రజల హక్కులను కాలరాస్తే పోరాటం చేయాల్సిందేనని స్పష్టంచేశారు. మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు రూ. 20 వేల కోట్లను కేటాయించాల్సి ఉండేదని చెప్పారు. ప్రభుత్వం వారిపై వివక్ష చూపడం సరికాదని చెప్పారు. పబ్లిసిటీ కోసం మాత్రం జగన్ సర్కార్ రూ. 15 వేల కోట్లను ఖర్చు చేసిందని ధ్వజమెత్తారు. వైసీపీ రంగుల కోనం రూ. 21,500 కోట్ల నిధులను దుర్వినియోగం చేసిందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఆ నిధులను దారి మళ్లించి ఎస్సీ, ఎస్టీలను మోసం చేశారని ఆగ్రహాం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’కి నిన్న కొండగట్టు అంజనేయస్వామి ఆలయంలో పూజ చేశారు. ఈ రోజు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కూడా పూజలు చేశారు. వాహనంతోనే పవన్ కల్యాణ్ ప్రజలను కలుస్తారు. నారా లోకేశ్ కూడా యువగళం పేరుతో ప్రజల్లోకి వస్తున్నారు.