దేశంలో ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గినట్లు జేఎల్ఎల్ ఇండియా తన హోమ్ పర్చేజ్ అఫోర్డబిలిటీ ఇండెక్స్(HPAI) నివేదిక వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సం ప్రారంభం నాటికి రుణ రేట్లు దశాబ్దాల కనిష్టానికి పడిపోయాయి. దీనికి తోడు ధరలు కూడా పడిపోయాయి. ఈ కారణంగా చాలామంది ఇళ్ల కొనుగోలుకు మొగ్గు చూపారు. అయితే గత కొద్ది నెలలుగా కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచుతోంది. దీంతో వడ్డీ రేట్లు పెరిగి, కొనుగోలుదారులకు వడ్డీ భారం పెరుగుతోంది. అదే సమయంలో కరోనా నుండి మార్కెట్ కోలుకోవడంతో ఇళ్ళ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. వడ్డీ రేటు పెరుగుదల, ధరలు పెరుగుతున్న కారణంగా 2022 ఏడాదిలో కొనుగోలు శక్తి కూడా మందగించిందని ఈ నివేదిక తెలిపింది.
దేశంలోని ఏడు ప్రధాన నగరాల విషయానికి వస్తే ముంబై అతి ఖరీదైన మార్కెట్‌గా నిలిస్తే, హైదరాబాద్, కోల్‌కతా, పుణేలలో హౌసింగ్ మార్కెట్ అందుబాటులో ఉన్నట్లుగా తెలిపింది. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 1000 చదరపు అడుగుల ఫ్లాట్‌కు సంబంధించి హోమ్ లోన్ కోసం అర్హత పొందేందుకు కావాల్సిన కనీస ఆదాయాన్ని కుటుంబ ఆదాయంగా నిర్వచించి, 100 వ్యాల్యూ ఉంటే ఒక కుటుంబానికి రుణం తీసుకునే సామర్థ్యం ఉన్నట్లుగా తెలిపింది. అంటే 100 పాయింట్లకు పైన ఉంటే కొనుగోలు శక్తి పెరగడం, తక్కువగా ఉంటే కొనుగోలు శక్తి తగ్గిందని భావించాలి. దీని ప్రకారం ముంబై వెనుకబడింది. కోల్‌కతా ముందు నిలిచింది.
ఈ నివేదిక ప్రకారం కోల్‌కత 193 పాయింట్లతో ముందు నిలిచింది. ఆ తర్వాత వరుసగా పుణే 183, హైదరాబాద్ 174, బెంగళూరు 168, చెన్నై 162, ఢిల్లీ 125 పాయింట్లతో సానుకూలంగా కనిపించగా, ముంబై 92 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ గత ఏడాది కంటే కాస్త తగ్గింది. అప్పుడు 196 ఉండగా, ఇప్పుడు 174కు వచ్చింది. గత ఏడాది కోల్‌కతా 212, పుణే 195, బెంగళూరు 185, చెన్నై 181, ఢిల్లీ 140, ముంబై 100 వ్యాల్యూతో నిలిచాయి. అన్ని నగరాల్లోను గత ఏడాది కంటే కొనుగోలు శక్తి క్షీణించింది.
2013 నుండి 2021 మధ్య అఫోర్డబిలిటీ అన్ని ముఖ్య నగరాల్లోను క్రమంగా పెరుగుతూ వచ్చిందని జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. 2013లో 65 వద్ద ఉన్న ఢిల్లీ స్కోర్ 2023 నాటికి 121కి చేరుకోవచ్చునని అంచనా వేస్తోంది. 2013లో 90 వద్ద ఉన్న బెంగళూరు స్కోర్ 2023 నాటికి 167కు, కోల్‌కతా 87 (2013) నుండి 192 (2023)కు చేరుకోవచ్చునని తెలిపింది.