కేరళ ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో కీలక బిల్లును పాస్ చేసింది. యూనివర్సిటీలకు ఛాన్సలర్‌గా గవర్నర్ ఉండటానికి స్వస్తీ పలుకుతూ బిల్లును తీసుకువచ్చింది. అంతేకాదు, గవర్నర్‌కు బదులుగా విద్యారంగ నిపుణులను ఆ పదవిలో నియమించడానికి కూడా ఈ బిల్లు అనుమతిస్తుంది. ఈ బిల్లుకు రాష్ట్ర శాసన సభ మంగళవారం ఆమోదం తెలిపింది. కేరళ గవర్నర్ ఆరీఫ్ మొహమ్మద్ ఖాన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య గత కొద్ది రోజులుగా ఇందుకు సంబంధించి వివాదం తలెత్తింది. ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఏకంగా యూనివర్సిటీల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగిస్తూ బిల్లు తీసుకురావడం గమనార్హం.
కేరళలో లెఫ్ట్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలో ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రతిపక్షంలో ఉంది. యూడీఎఫ్ ఈ బిల్లులో కొన్ని మార్పులను సూచించింది. దీనికి ప్రభుత్వం ఆమోదించక పోవడంతో సభ నుండి వాకౌట్ చేసింది. యూనివర్సిటీ లాస్(అమెండ్మెంట్) బిల్లుకు సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు. గవర్నర్‌కు బదులు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులను లేదా హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తిని ఛాన్సలర్‌గా నియమించాలని, రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాలకు 14 మంది ఛాన్సలర్లను నియమించాలని ప్రతిపక్షం సూచించింది.