మూఢనమ్మకాల చాటున మానవులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అతీత శక్తులు ఉన్నాయంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఘోర సంఘటన జరిగింది. పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళకు ఆమె భర్త, అతడి కుటుంబసభ్యులు అస్థికలు తినిపించారు. క్షుద్ర పూజలు నానా బీభత్సం సృష్టించారు. ఆ బాధలకు తాళలేక బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది.
మహారాష్ట్రలోని సింహగడ్ పోలీసుల వివరాల ప్రకారం.. పుణెలోని ధైరీ ప్రాంతంలో నివసిస్తున్న ఓ మహిళకు జయేశ్ పోక్లేతో మూడేళ్ల కిందట వివాహమైంది. అయితే వారికి సంతానం కలగలేదు. పిల్లల విషయంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతోపాటు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. ఈ విషయాలపై భర్త, ఆమె అత్తామామలు ప్రభావతి పోక్లే, కృష్ణ పోక్లే, మరదలు ఇషా పోక్లే తరచూ దాడి చేస్తున్నారు. శారీరకంగా, మానసికంగా చిత్రవధ చేస్తున్నారు. దీనికి తోడు భర్త కుటుంబానికి మూఢ నమ్మకాల పిచ్చి ఉంది.
కొందరి సూచన మేరకు భర్త, అత్తామామలు కలిసి ఆమెతో క్షుద్ర పూజలు చేయించారు. ఆమె చేత అస్థికల బూడిదను తినిపించారు. ఇలా చేస్తే పిల్లలు పుడతారని వారి నమ్మకం. అయితే అంతకుముందు కొన్ని పూజలు తనతో చేయించారని పోలీసులతో బాధితురాలు పేర్కొంది. పూజల్లో చివరి ఘట్టం అస్థికలు తినిపించడం అని పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సింహగడ్ పోలీసులు మొత్తం 8 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయి విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంపై మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రూపాలీ చకంకర్ కూడా స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు.