సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్…. సోమవారం ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా…. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. కాగా… ములాయం సింగ్ మృతిపట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ములాయం మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘ములాయం సింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ములాయం ఆత్మకు శాంతి చేకూరని కోరుకుంటున్నా’ అని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, ప్రముఖ స్వతంత్ర సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి గొప్ప నేతల స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చారని సీఎం గుర్తు చేసుకున్నారు.
ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. ఉత్తరప్రదేశ్ ఇటావా జిల్లాలోని ములాయం స్వగ్రామం సైఫయ్కు ఈరోజు మధ్యాహ్నం సీఎం చేరుకోనున్నారు. దివంగత ములాయం సింగ్ పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించనున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి ములాయం సింగ్ యాదవ్ స్వగ్రామం వెళ్లనున్నారు. ములాయం అంతిమ సంస్కార కార్యక్రమానికి హాజరై. అనంతరం తిరిగి ఢిల్లీ చేరుకుని.. రాత్రికి విజయవాడకు బయలుదేరుతారు.