దశాబ్దాలుగా సేవలందించిన పార్లమెంట్ (Parliament) పాత భవనం శకం ముగిసింది. ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య కొత్త భవనంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఎన్నో ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పాత పార్లమెంట్ ఇప్పుడు ఒక చరిత్రగా నిలిచిపోనుంది. 96 ఏండ్లుగా భారత రాజకీయాలకు నిలువెత్తు సాక్ష్యంగా ఉన్న పార్లమెంటు పాత భవనం శకం నేటితో ముగిసిపోయింది. పాత పార్లమెంటు భవనానికి సభ్యులు వీడ్కోలు పలికారు. దీంతో నేటి నుంచి నూతన పార్లమెంట్ భవనంలో (New Parliament house) ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా, ప్రపంచస్థాయి సౌకర్యాలతో నిర్మించిన సెంట్రల్ విస్టా (Central Vista) సరికొత్త వేదికగా నిలువనుంది. మంగళవారం ఉదయం పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) నేతృత్వంలో ప్రారంభ కార్యక్రమం జరుగనుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి (Minister Prahlad Joshi) స్వాగత ప్రసంగం చేయనున్నారు. మధ్యాహ్నం 1.15 గంటలకు లోక్‌సభ, 2.15 గంటలకు రాజ్యసభ ప్రారంభం కానున్నాయి.
అంతకుముందు పార్లమెంటు సెంట్రల్ హాల్లో (Central Hall) రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో కార్యక్రమం జరుగనుంది. దాదాపు గంటన్నరపాటు జరుగనున్న ఈ కార్యక్రమం జాతీయ గీతంతో ప్రారంభమై.. జాతీయ గీతంతోనే ముగుస్తుంది. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రసంగించనున్నారు. ఆయనతోపాటు సీనియర్ పార్లమెంటేరియన్లు అయిన బీజేపీ ఎంపీ మేనకా గాంధీ (Maneka Gandhi), జేఎంఎం లీడర్ శిబు సోరెన్ (Shibu Soren) కూడా మాట్లాడ నున్నారు. సెంట్రల్ హాల్ కార్యక్రమానికి ముందు ఎంపీలంతా కలిసి ఫొటో దిగనున్నారు. కొత్త భవనాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది కేంద్రంలోని మోడీ ప్రభుత్వం.. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనాన్ని.. ఈ ఏడాది మేలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ భారీ భవనం లోక్‌సభ ఛాంబర్లో 888 మంది సభ్యులు, రాజ్యసభ ఛాంబర్లో 384 మంది సభ్యులు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు.
ఉభయ సభల ఉమ్మడి సమావేశానికి 1,280 మంది ఎంపీలకు లోక్‌సభ ఛాంబర్లో వసతి కల్పించారు. ఎంపీలు కూర్చునేందుకు పెద్ద హాలు, లైబ్రరీ, కమిటీల కోసం అనేక గదులు, డైనింగ్ రూమ్‌లు (Dining rooms), పార్కింగ్ స్థలాలు ప్రత్యేకంగా ఉన్నాయి. కొత్త పార్లమెంటు భవనంలో కాగితరహిత కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ప్రతి ఎంపీకి ఓ ట్యాబ్ ఇస్తారు. అందులోనే సభ నిర్వహణ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు, అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుందీ నవభారత ప్రజాస్వామ్య దేవాలయం. పాత పార్లమెంటు భవనం లోపలి ప్రాంగణంలో రాజ్యసభ(Rajya Sabha), లోక్‌సభ సభ్యులు వేర్వేరుగా, అంతా కలిసి మరో ఫొటో తీసుకోనున్నారు. . పార్లమెంట్‌కు ఆరు ద్వారాలు ఉన్నాయి. వాటికి గజ, అశ్వ, గరుడ, మకర, శార్దూల, హంస అని నామకరణం చేయడం విశేషం. మంగళవారం ఉదయం గణపతి పూజతో కొత్త పార్లమెంటులో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.