»President Droupadi Murmu Addresses A Joint Session Of Both Houses Of Parliament
President : నీట్ లీకేజీ విషయంలో కఠిన చర్యలు : ద్రౌపతి ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్ సుస్థిరమైన అభివృద్ధిని సాధిస్తోందని చెప్పుకొచ్చారు. ఆమె ప్రసంగం వివరాలు ఇక్కడున్నాయి.
President Droupadi Murmu : భారత్ ఆరోగ్య రంగంలో అగ్రగామిగా ఎదుగుతోందని దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Droupadi Murmu) అన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నిందుతులపై కచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటూ ప్రకటించారు. గురువారం ఆమె పార్లమెంటు( Parliament) ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం దేశంలో పేదరికం నిర్మూలనకు కృషి చేస్తోందని చెప్పారు. గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచితంగా రేషన్ సరఫరా చేయనున్నట్లు తెలిపారు.
భారత్ సర్వతో ముఖాభివృద్ధిని సాధిస్తోందని చెప్పుకొచ్చారు. అన్ని రంగాల్లో వ్యవస్థల్లో మార్పులు తీసుకుని వస్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోసం పెద్ద నెట్వర్క్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పంటలకు మద్దతు ధరలను ఇచ్చే విషయంలో కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. సన్నకారు, చిన్న రైతుల కోసం పీఎం సమ్మాన్ నిధిని ఇస్తున్నామన్నారు. పాక్ జమ్ము కశ్మీర్ విషయంలో అంతర్జాతీయ వేదికలపై ఎంతో దుష్ప్రచారం చేసిందని అన్నారు. వారి కుట్రలకు అక్కడి ప్రజలే గట్టిగా బదులిచ్చారని తెలిపారు. కశ్మీరు(kasmir) లోయలో అభివృద్ధి కనిపిస్తోందని చెప్పారు.
ప్రభుత్వం చేపట్టే నియామకాలు, పరీక్షల్లో కచ్చితంగా పారదర్శకత వాంఛనీయమని చెప్పారు. పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీక్ల విషయంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. పరీక్షల్ని నిర్వహించేప్పుడు మరింత పకడ్బంధీగా వ్యవహరిస్తామని వెల్లడించారు. రక్షణ, సైనిక రంగాన్ని గత ఐదేళ్లలో ఎంతో బలోపేతం చేసినట్లు తెలిపారు. అలాగే మన దేశం నుంచి రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు సైతం పెరిగినట్లు చెప్పారు. తొలిసారిగా అంతర్జాతీయ రైలు మార్గానికి పునాదులు వేసిన విషయాన్ని గుర్తు చేశారు.