కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాని మోదీ (PM MODI) ఇంటిపేరుకు సంబంధించిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
ప్రధాని మోదీ (PM MODI) పేరును అవమానించారనే పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గుజరాత్ హైకోర్టుకు వెళ్లారు. 2019లో కర్నాటక(Karnataka)లోని కోలార్ లో మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని సూరత్ కోర్టు(Court of Surat) దోషిగా తేల్చి, రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో గత నెలలో లోక్ సభ సచివాలయం ఆయనపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల నేపథ్యంలో రాహుల్ తన అధికారిక బంగ్లాను కూడా ఖాళీ చేశారు. ఈ కేసులో తనకు విధించిన శిక్షను వాయిదా వేయాలన్న తన అభ్యర్థనను దిగువ కోర్టు తిరస్కరించడంతో రాహుల్ పై కోర్టులో అప్పీల్ చేసుకున్నారు.
దొంగలందరికీ మోదీ అనే కామన్ పేరు ఎలా వచ్చింది అని ఆయన చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ(Purnesh Modi) సూరత్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయనకు కోర్టు జైలు శిక్ష విధించింది. దీనిని కోర్టులో సవాల్ చేసేందుకు ముప్పై రోజుల సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. తన రెండేళ్ల శిక్షను నిలిపివేయాలని, తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని రెండు పిటిషన్లు(Petitions) దాఖలు చేశారు. ఏప్రిల్ 3న విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్ 13న ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పిటిషన్లను తిరస్కరించింది.