కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నేత (Congress Party Former leader) గులాం నబీ ఆజాద్ (Ghulam Nabi Azad) ఆ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు అవాంఛనీయ వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయని, ఆ వ్యాపారవేత్తలతో ఆ కుటుంబం మొత్తానికి లింక్స్ ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆజాద్ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నేతలు… రాహుల్ పైన, కాంగ్రెస్ నేతల పైన ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాంగ్రెస్ యువ నేత అలా కలిసిన వ్యాపారులు ఎవరు, వారి ఉద్దేశ్యాలు ఏమిటో చెప్పాలని నిలదీస్తున్నారు. ఆజాద్ సహా ఐదుగురు మాజీ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలను బీజేపీ తమకు అనుకూలంగా వినియోగించుకుంటోందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. గౌతమ్ అదానీతో సంబంధాలు ఉన్న వారిలో ఆజాద్ తో పాటు పలువురు ఉన్నారని పేర్కొన్నారు. అయితే ఎందుకు కలిశారు, ఏ వ్యాపారవేత్తలతో కలిశారనే విషయం చెప్పాలి కదా అని బీజేపీ చెబుతోంది.
ఓ మలయాళ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గురించి ఆజాద్ షాకింగ్ అంశాలు వెలుగులోకి తెచ్చారు. రాహుల్ విదేశాలకు వెళ్లినప్పుడు ఎక్కడికి వెళతాడో 10 ఉదాహరణలు ఇవ్వగలనని చెప్పారు. దేశంలో కాంగ్రెస్ అంతరించిపోయిందని, కొందరు నేతలు మాత్రం మిగిలి ఉన్నారన్నారు. రాహుల్ సహా ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వం పార్టీపై ఎలాంటి ప్రభావం చూపలేకపోతోందన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ ఛరిష్మా పెరిగిందని చాలామంది అంటున్నారని, కానీ తనకు తెలిసినంత వరకు అలాంటిదేమీ లేదన్నారు. రాహుల్ కు ప్రజాదరణ పెరగలేదని, రాహుల్ ఇటీవల సూరత్ కోర్టుకు వెళితే ఒక్క గుజరాతీ యువకుడు కానీ, గుజరాతీ రైతు కానీ ఆయనను కలిశారా? అని నిలదీశారు.
తనకు అదానీతో లింక్స్ ఉన్నాయన్న రాహుల్ వ్యాఖ్యలపై ఆజాద్ భగ్గుమన్నారు. ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటు, అసలు అదానీతో గాంధీ కుటుంబానికే సంబంధాలు ఉన్నాయన్నారు. మాములుగా అయితే తనకు గాంధీ కుటుంబం మీద మంచి గౌరవం ఉందని, వారికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడాలని అనుకోవడం లేదన్నారు. కానీ రాహుల్ మాత్రం దేశం వెలుపల అవాంఛనీయ వ్యాపారవేత్తలను ఎక్కడికో వెళ్లి కలుస్తాడని, తాను ఉదాహరణలు కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ పార్టీని వీడడంపై ఆజాద్ స్పందించారు. అనిల్ కాంగ్రెస్ ను వీడడం దురదృష్టకరమన్నారు. 50 ఏళ్ల లోపు వయస్సు ఉన్న నేతలు కాంగ్రెస్ ను వదిలి వెళ్లిపోవడానికి కారణం రాహుల్ లో నాయకత్వ లక్షణాలు, దార్శనికత లేకపోవడమే అన్నారు.