పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనలపై కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో లోక్ సభ నుంచి 33 మంది సభ్యులను సస్పెండ్ చేస్తు స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.
భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రగడ కొనసాగుతుంది. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా అధికార బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్షాలు రెండు సభల్లో డిమాండ్ చేశాయి. దీంతో తాజాగా వాయిస్ ఓటు ద్వారా 45 మంది ఎంపీలను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. ఇదిలావుండగా సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారనే కారణంతో కాంగ్రెస్కు చెందిన అధిర్ రంజన్ చౌదరి, డిఎంకె నుంచి టిఆర్ బాలు, దయానిధి మారన్ సహా మొత్తం 33 మంది ప్రతిపక్ష సభ్యులను సోమవారం లోక్సభ నుంచి సస్పెండ్ చేశారు.
అయితే వీరిలో 30 మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా..మరో ముగ్గిరి సస్పెన్షన్ పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు లోక్ సభలో ఇప్పటికే 13 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ విధించారు. గత గురువారం వారిపై వేటు పడింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు లోక్ సభ నుంచి మొత్తం 46 మంది సస్పెండ్ అయ్యారు. అయితే ఈ రెండు సభల నుంచి మొత్తం 92 మంది సస్పెండ్ కావడం విశేషం.
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వం నుంచి సమాధానం మాత్రమే కోరుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలీక్ అన్నారు. హోంమంత్రి సభకు వచ్చి దీనిపై ప్రకటన ఎప్పుడు సమాధానం ఇస్తారని మాత్రమే మేము అడిగామన్నారు. ఈ ప్రశ్నలు అడిగినందుకు మమ్మల్ని సస్పెండ్ చేశారని వెల్లడించారు. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీలు ప్రతాప్ సింహా, రమేష్ బిధూరిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
మరోవైపు విపక్షాల అసభ్య ప్రవర్తన వల్లే సస్పెన్షన్ వేటు పడిందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి ఎజెండా లేదా సమస్య లేనందున ప్రతిపక్షాలు అభద్రతా భావానికి గురవుతున్నాయని తెలిపారు. వారు సభను నడపనివ్వడం లేదు కాబట్టి స్పీకర్ వారిని సస్పెండ్ చేశారని తెలిపారు. మేము దానికి మద్దతు ఇచ్చామని వెల్లడించారు.