Loksabha దాడికి ముందే పోస్ట్, ఉరిశిక్ష విధించండి అంటోన్న తండ్రి
లోక్ సభలోకి దూసుకెళ్లిన ఆగంతకుడు సాగర్ శర్మ అంతకుముందే సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. లోక్ సభలో ప్రవేశించి రచ్చ చేస్తామని ముందే అందులో పేర్కొన్నారు. మరో దుండగుడి తండ్రి స్పందించారు. తప్పు చేసినట్టు రుజువైతే ఉరి శిక్ష విధించాలని కోరారు.
My Son Did Wrong Hang Him: లోక్ సభలో (Loksabha) దుండగులు హల్ చల్ చేసిన ఘటనను యావత్ దేశ ప్రజలు ముక్తకంఠంతో ఖండించారు. ప్రజా ప్రతినిధులు ఆశీనులైన సభలో చొరబడి, పసుపు రంగు గ్యాస్ వదలడం ఏంటీ అని మండిపడ్డారు. అందులో ఒకరు అయిన సాగర్ శర్మ చొరబడేందుకు ముందు సోషల్ మీడియా ఇన్ స్ట్రాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు. పార్లమెంట్లో లోపలికి వెళ్లేందుకు ఫిక్స్ అయి మరి వెళ్లారు.
గెలిచిన లేదంటే ఓడినా ప్రయత్నించడం ముఖ్యం అని అందులో పేర్కొన్నారు. ఈ ప్రయాణం ఎంత అందంగా ఉంటుందో.. అందరినీ మళ్లీ కలుస్తానని ఆశిస్తున్నానని రాసుకొచ్చారు. లోక్ సభలోకి వెళ్లి.. రచ్చ రచ్చ చేద్దామని ముందే అనుకొని వెళ్లాడని అర్థం అవుతోంది. సాగర్ ఉత్తరప్రదేశ్‌లో గల ఉన్నావ్ జిల్లా అని అధికారులు తెలిపారు. ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండురోజుల క్రితం లక్నో నుంచి బయల్దేరి వచ్చాడు. ఇలా చేస్తాడని అనుకోలేదని అంటున్నారు. ఇటీవల బెంగళూర్ నుంచి లక్నో వచ్చాడని.. అతను ఈ రిక్షా నడిపేవాడని స్థానిక పోలీసులు చెబుతున్నారు.
2001 పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరగగా.. 2023 డిసెంబర్ 13వ తేదీన కూడా మనోరంజన్ అనే వ్యక్తితో సాగర్ శర్మ లోక్ సభలోకి ప్రవేశించాడు. సభ జీరో అవర్ జరుగుతున్న సమయంలో పబ్లిక్ గ్యాలరీ నుంచి లోక్ సభ ఛాంబర్లోకి దూకాడు. డబ్బాల నుంచి గ్యాస్ లీక్ చేశాడు. ఎంపీలు కూర్చొనే స్థలం నుంచి స్పీకర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా.. భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
మనోరంజన్ తీరు గురించి అతని పేరంట్స్ మండి పడుతున్నారు. తప్పు చేస్తే తన కుమారుడిని ఉరి తీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి చేస్తే ఎంకరేజ్ చేస్తానని.. తప్పు చేస్తే ఖండిస్తానని తెలిపారు. లోక్ సభలో చొరబాటు ఘటనలో మనోరంజన్‌ది తప్పేనని అంగీకరించారు. సమాజానికి హాని కలిగించేలా ప్రవర్తించడం సరికాదని పేర్కొన్నారు.