ప్రతిష్టాత్మక మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ నుండి కర్నాటకకు చెందిన దివితా రాయ్ పాల్గొంటున్నారు. మిస్ యూనివర్స్ పోటీలు లూసీయానాలోని న్యూఓర్లీన్స్… ఎర్నెస్ట్ మోరియల్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్నాయి. వివిధ దేశాల నుండి 86 మంది మహిళలు పాల్గొంటున్నారు. మిస్ యూనివర్స్ 71వ ఎడిషన్ ఇది. ఈ ఎడిషన్ ప్రత్యేకత మొత్తం మహిళలే ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఏడాది మిస్ యూనివర్స్ 2021 కిరీటాన్ని మన దేశానికి చెందిన హర్నాజ్ సంధు గెలుచుకున్నారు. ఇప్పుడు దివితా రాయ్ విశ్వసుందరి పోటీల్లో నెగ్గితే హర్నాజ్ ఆమెకు కిరీటం అలంకరించాల్సి ఉంటుంది. ఈ పోటీలు ఈస్టర్న్ టైమ్ ప్రకారం జనవరి 14, శనివారం సాయంత్రం 8 గంటలకు ఉంటాయి.
విశ్వసుందరి పోటీల్లో భారత్ నుండి నిలిచిన దివితా రాయ్ గురించి తెలుసుకుందాం… దివితా రాయ్ మంగళూరులో జన్మించారు. ముంబైలోని సర్ జేజే కాలేజీ ఆఫ్ ఆర్కిటెక్చర్ కాలేజీలో చదివారు. ప్రొఫెషన్ పరంగా ఆమె మోడల్, ఆర్కిటెక్ట్. బ్యాడ్మింటన్ బాస్కెట్ బాల్, పెయింటింగ్, సంగీతం వినడం, పుస్తకాలు చదవడం ఇష్టం.
ఆగస్ట్ 22, 2022న మిస్ దివా ఆర్గనైజేషన్ 10వ వార్షికోత్సవం సందర్భంగా దివిత రాయ్ మిస్ దివా యూనివర్స్ 2022 కిరీటం దక్కించుకున్నారు. మిస్ దివా యూనివర్స్ పేజాంట్ 2021లో హర్నాజ్ సంధు కిరీటం దక్కించుకోగా, దివిత రన్నరప్‌గా నిలిచారు. జీవితాన్ని స్వీకరించాలి, మార్పుకు భయపడవద్దు, ప్రతి క్షణాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలి అనేది దివితా రాయ్ లైఫ్ స్లోగన్. 1994 మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ నుండి ప్రేరణ పొందినట్లు చెబుతారు.