Raj Bhavan Bomb Threat: కర్ణాటక రాజధాని బెంగళూరులోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) కంట్రోల్ రూమ్‌లో సోమవారం రాత్రి వచ్చిన ఓ ఫోన్ కాల్ కలకలం సృష్టించింది. రాత్రి 11:30 గంటలకు కాల్ చేసిన వ్యక్తి రాజ్‌భవన్‌లో బాంబులు పెట్టిన విషయాన్ని ఎన్ఐఏకు తెలియజేశాడు. దీంతో ఎన్ఐఏ బెంగళూరు పోలీసులకు సమాచారం అందించింది. బెంగళూరు పోలీసులు వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో రాజ్‌భవన్‌కు చేరుకుని కాంప్లెక్స్ మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీసు బృందానికి రాజ్‌భవన్‌లో ఎలాంటి బాంబు లభించకపోవడంతో ఇది రూమర్ అని తేలిపోయింది.
ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో రాజ్‌భవన్‌లో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. ఇది తప్పుడు సమాచారం అని తెలిపారు. అయితే మంగళవారం మరోసారి రాజ్‌భవన్‌ను విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. బెదిరింపులకు పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా రాజ్‌భవన్ వద్ద భద్రతను పెంచారు.
గతంలో 60 స్కూళ్లను పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. అంతకుముందు డిసెంబర్ 1న బెంగళూరు నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని దాదాపు 60 పాఠశాలల్లో బాంబులు అమర్చినట్లు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు. ఆ పాఠశాలల్లో కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నివాసం ముందు ఉన్న స్కూల్ కూడా ఉంది. అధికారుణ పరిశీలనలో ఏమీ దొరకనప్పటికీ, ఈ ఇమెయిల్‌ల తర్వాత కలకలం రేగింది. ఈ వ్యవహారంలో పోలీసులు ఇంకా ఏమీ వెల్లడించలేదు. వారు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు గూగుల్‌కు లేఖ రాశారు.