ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు కే.బి. హెడ్గేవార్ (K.B. Hedgewar) గురించిన పాఠాన్ని స్కూల్ పాఠ్యాంశాల నుంచి తొలగించాలని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. కర్ణాటక (Karnataka)లో సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కీలక నిర్ణయం తీసుకుంది. గత బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని (anti conversion law)’ రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కర్ణాటక కేబినెట్ (Cabinet) గురువారం రద్దు ప్రతిపాదనను ఆమోదించింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ వెల్లడించారు.
త్వరలో దీన్ని శాసనసభలో ప్రవేశపెట్టి చట్టాన్ని రద్దు చేయనున్నారు. కర్ణాటకలో గత సర్కార్ మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని (anti conversion law) అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బలవంతంగా, వంచించి, ఒత్తిళ్లు తీసుకు వచ్చి, తాయిలాలను ఆశచూపి, వివాహం చేసుకుంటానని నమ్మించి మతమార్పిడికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఈ చట్టాన్ని రూపొందించారు. దీనికి సంబంధించి పౌరులు(Citizens), కుటుంబ సభ్యులు, భాగస్వాములు, సహోద్యోగులు పోలీసులు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. బలవంతంగా మత మార్పిడికి పాల్పడితే జామీను రహిత అరెస్టు ఉంటుంది. బలవంతంగా మత మార్పిడులకు పాల్పడే వ్యక్తులకు 3 నుంచి 10 ఏళ్ల శిక్ష, రూ.50 వేల వరకు జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలు పొందుపరిచారు.