»Jamili Elections Kovind Submitted A Report To The President On Jamili Elections
Jamili Elections: జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కోవింద్
ఒకే దేశం.. ఒకే ఎన్నికలు పేరుతో దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేసి.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ నివేదికను సమర్పించింది.
Jamili Elections: ఒకే దేశం.. ఒకే ఎన్నికలు పేరుతో దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఈ నివేదికను సమర్పించింది. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల నివేదికను ప్రథమ పౌరురాలికి అందజేశారు. దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకగ్రీవంగా తన అభిప్రాయాన్ని తెలిపింది. దాదాపు 190 రోజుల పాటు ఈ అంశంపై కమిటీ అధ్యయనం చేసింది. వివిధ రంగాల నిపుణులతో సమావేశాలు నిర్వహించింది. 47 రాజకీయ పార్టీలు దీనిపై తమ అభిప్రాయాలు తెలిపాయి.
ఇందులో 32 జమిలి ఎన్నికలకు మద్దతిచ్చాయి. ప్రజల నుంచి కూడా కమిటీ సలహాలు, సూచనలు కోరగా 21558 స్పందనలు వచ్చాయి. వీళ్లలో 80 శాతం మంది ఏకకాల ఎన్నికలను సమర్థించారు. జమిలి ఎన్నికలకు కోవింద్ కమిటీ రెండంచెల విధానాన్ని సూచించింది. మొదట లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో పోలింగ్ నిర్వహించాలని పేర్కొంది. ఆ తర్వాత 100 రోజులకు మున్సిపాలిటీలు, పంచాయితీలకు ఎన్నికలు జరపాలని నివేదికలో తెలిపింది. ఏకకాల ఎన్నికల నిర్వహణపై గత కొన్నేళ్లుగా బలంగా ప్రచారం చేస్తున్న మోదీ సర్కారు.. 2023 సెప్టెంబరులో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది.
కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నియమించింది. కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్ సుభాష్ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది.ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది.