ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మిషన్‌కు ఇస్రో (ISRO) సిద్ధమైంది. గతంలో చంద్రయాన్3 (Chandrayaan3) ప్రయోగం చేపట్టి విజయం సాధించిన ఇస్రో ఇప్పుడు మరో అద్భుత ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఎక్స్-కిరణాల అధ్యయనానికి ఇస్రో పరిశోధనలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. మొదటిసారి పొలారిమెట్రీ మిషన్‌ను ప్రయోగించనుంది. డిసెంబర్ 28వ తేదిన ఈ ప్రయోగాన్ని చేపడుతున్నట్లు ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు.
ఎక్స్-కిరణాల మూలాల పోలరైజేషన్ అధ్యయనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ మిషన్‌ను ఇస్రో చేపట్టనుంది. భారత్ మొదటిసారి ఈ శాటిలైట్ ప్రయోగానికి సిద్దమైందని చెప్పాలి. ఈ పరిశోధనలో ఇమేజింగ్, టైమ్ డొమైన్, స్పెక్ట్రోస్కోపీ వంటివాటిపై శాటిలైట్ ప్రయోగాలు చేయనుంది. ఈ మిషన్ ద్వారా రాబోయే రోజుల్లో చేయబోయే ప్రయోగాలకు మంచి జరగనుందని ఇస్రో సైంటిస్టులు తెలిపారు.
కాంతి ధ్రువణాన్ని కొలిచేందుకు భారత్ ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. ప్రపంచంలోనే ఇది రెండో అంతరిక్ష మిషన్ కావడం విశేషం. ఈ మిషన్ ఎంతో ప్రత్యేకమైనదని, కీలకమైనదని, ఖగోళ మూలాల ఉద్గారాలను అర్థం చేసుకునేందుకు, కొలిచేందుకు ఈ ప్రయోగం ఎంతగానో సహాయపడుతుందని ఇస్రో వెల్లడించింది. దీంతో తోకచుక్కల నుంచి సుదూర ప్రాంతాల్లో ఉన్న గెలాక్సీల వరకూ సమాచారాన్ని అనుమతించే అతి శక్తివంతమైన సాధనంగా ఈ ప్రయోగం ఉపయోగపడనుంది.