Southwest Monsoon 2024 : అనుకున్న దానికంటే ముందుగానే నైరుతీ రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. మే 31కి ఒక రోజు అటూ ఇటూలో అవి కేరళను తాకుతాయని భారత వాతావరణ శాఖ(India Meteorological Department) తెలిపింది. ఈనెల 19న ముందుగా అండమాన్‌ను తాకి ఆ తర్వాత అవి కేరళకు వస్తాయని వెల్లడించింది.
ఈసారి వర్షాలపై లానినా ప్రభావం ఉంటుందని ఐఎండీ తెలిపింది. దీని వల్ల సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు ఉంటాయని వెల్లడించింది. ఆగస్టు నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో వర్షాలు అధికంగా కురిసే అవకాశాలు ఉంటాయని చెప్పపింది. ఈ విషయమై ఆ శాఖ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడారు. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి విత్తనాలు నాటే సమయంలో వర్షాలు కీలకం అన్నారు. జూన్, జులై నెలల్లో పడే వర్షాలు కీలకంగా ఉంటాయని తెలిపారు.
ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం.. మనకు నైరుతీ రుతుపవనాల రాక తేదీలు ఎప్పటికప్పుడూ ఏటా మారుతూనే ఉన్నాయి. ఇదే తేదీన వస్తాయని అనుకోడానికి లేదు. 1981లో చాలా ముందుగా మే 11నే భారత్‌లోకి ప్రవేశించాయి. 1972లో చాలా ఆలస్యంగా జూన్ 18న ప్రవేశించాయి. 2021లో జూన్ 2న, 2022లో మే 29న, 2023లో జూన్ 1న ఇవి కేరళను తాకాయి. కాగా ఈ ఏడాది మే 31కి తాకవచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.