»Happy Teachers Day 2023 Lets Recognize Their Services
Happy Teachers Day 2023: వారి సేవలను గుర్తిద్దాం
తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే ఉపాధ్యాయులు మన భవిష్యత్తుకు మార్గనిర్దేశకులుగా ఉంటారు. నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులు మంచి స్థాయికి చేరుకునేందుకు తోడ్పాటునందిస్తారు. అలాంటి గురువుల బాధ్యతను గుర్తు చేసుకోవడం తప్పనిసరి. అందుకే దేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని(national teachers day) జరుపుకుంటున్నాం.
ఇండియాలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని(Happy Teachers Day) జరుపుకుంటున్నాము. ఈ రోజున జన్మించిన(05 సెప్టెంబరు 1888న) భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, పండితుడు, తత్వవేత్త, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్(sarvepalli radhakrishnan) పుట్టినరోజు. 1962లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి రెండో రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ క్రమంలో ఆయన సెప్టెంబర్ 5వ తేదీని ప్రత్యేక దినంగా జరుపుకోవాలని కోరారు. సమాజంలో ఉపాధ్యాయుల అమూల్యమైన కృషిని గుర్తించేందుకు సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు దేశంలోనే అత్యుత్తమమైన వ్యక్తులు ఉండాలని సర్వేపల్లి అన్నారు. దీంతోపాటు ఆయన చేసిన విశేష కృషికి గాను ఆయనకు 1954లో భారతరత్న పురస్కారం లభించింది. ఇతర దేశాలలో ఈ దినోత్సవాన్ని అక్టోబర్లో జరుపుకుంటారు.
మార్గదర్శకులుగా
ఈ సందర్భంగా దేశంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా(teachers day) జరుపుకుంటారు. విద్యార్థులు తమ ప్రియమైన ఉపాధ్యాయుల పట్ల తమ అభిప్రాయలను వ్యక్తం చేస్తారు. ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రత్యేక ప్రదర్శనలు, నృత్యాలు, విస్తృతమైన వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలుస్తారు.
అవార్డులు ప్రకటన
ఈ సంవత్సరం సెప్టెంబర్ 5, 2023న ఎంపిక చేసిన 75 మంది ఉపాధ్యాయులకు న్యూ ఢిల్లీ(Delhi)లోని విజ్ఞాన్ భవన్లో ‘నేషనల్ టీచర్ అవార్డ్ 2023’తో సత్కరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయులకు అవార్డులు అందజేస్తారు. వీరిలో 50 మంది పాఠశాల ఉపాధ్యాయులు, 13 మంది ఉన్నత విద్య ఉపాధ్యాయులు, 12 మంది నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ నుంచి ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున దేశంలోని ఉపాధ్యాయుల విశిష్ట సహకారం, వారి సేవలను గుర్తు చేసుకుంటారు.