భారతీయ రైల్వే(Indian Railways) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే భోజనాన్ని అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆహారం కోసం రైల్వే ప్రయాణికులు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకున్న రైల్వే బోర్డు (Railway Board) తక్కువ ధరకే భోజనం, టిఫిన్ అందుబాటులోకి తీసుకురావాలన్న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోని 4 స్టేషన్లలో తక్కువ ధర భోజనాలను అందుబాటులోకి తెచ్చింది. తొలి దశలో హైదరాబాద్(Hyderabad), విజయవాడ, గుంతకల్, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఈ సేవలను ప్రారంభించినట్లు ద.మ. రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ నాలుగు స్టేషన్లలో రూ.20 కే అల్పాహారం, రూ.50 కే నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్(GM ArunKumarJain) తెలిపారు. ఈ మేరకు సాధారణ కోచ్ లు ఆగే ప్లాట్‌ఫారమ్ లపై ఈ తక్కువ ధరకే అందించే భోజనం, అల్పాహారం కౌంటర్లు ఉంచనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఐఆర్సీటీసీ (IRCTC) నిర్వహించే జన్ ఆహార్ ఫుడ్ ఔట్లెట్స్, రిఫ్రెష్మెంట్ రూమ్స్‌లో ‘ఎకానమీ మీల్స్’ను కొనుగోలు చేయవచ్చు. స్టేషన్లలోని అన్ని ప్లాట్‌ఫామ్స్‌పై సైతం భోజనం దొరుకుతుంది.
అయితే, వీటిని ఎక్కువగా జనరల్ బోగీలకు సమీపంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.గుర్తింపు పొందిన వెండర్స్
(Vendors) మాత్రమే విక్రయించనున్నారు. భోజనాన్ని రెండు కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరిలో ఏడు పూరీలతో ఆలు కూర, పచ్చడిని కలిపి రూ.20 అందిస్తున్నారు. రెండో కేటగిరిలో అన్నం, రాజ్మా, ఛోలే, కిచిడీ కుల్చే, భటురే, పావ్‌భాజీ, మసాలా దోషల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు.